అసమానప్రజ్ఞాశాలి, సినీ వినీలాకాశంలో అలుపెరుగని నిత్యసంగీత సాధకుడు, పుంభావసరస్వతీ స్వర వరపుత్రుడు, గానగంధర్వుడు, పద్మశ్రీ, పద్మవిభూషణుడు అన్నింటికీ మించి మహోన్నత మానవతావాది పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఆకస్మికంగా దివికేగడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అసంఖ్యాక అభిమానులు శోకతప్తులైఉన్న విషాదసమయంలో బాధ్యతారహిత సామాజిక మాథ్యమం విషం చిమ్మడం బాధాకరం.
బాలుగారికి నిర్విరామంగా ప్రపంచ ఉన్నతస్థాయి వైద్యం అందించిన ఎంజీఎం ఆసుపత్రిపై నిరాధార ఆరోపణలు చేయడం దుర్మార్గం.
ఆసుపత్రికి చెల్లించాల్సిన ఫీజుల విషయంలో బాలు కుటుంబాన్ని తీవ్ర ఒత్తిడికి గురిచేసినట్లు సామాజిక మాధ్యమాలలో విస్తృత ప్రచారం కావడం, బాలు కుమారుడు చరణ్ ఆసుపత్రి వర్గాలతో కలసి మీడియా ముందుకు రావడం ఒకదాని వెంట ఒకటి చోటుచేసుకోవడం బాలు అభిమానులను మరోసారి తీవ్రంగా కలవర పరుస్తోంది.
కళామతల్లి హృదయానికి సమసిపోని బాధను మిగిల్చి… సుదూరంగా …తిరిగిరాని లోకాలకు పాటల పల్లకిలో వెళ్ళిపోయిన సుమధుర గాత్రయోగి ఎస్ పీ బాలు ఆకస్మిక నిష్క్రమణ విధించిన శోక ఛాయలు వీడకముందే కొన్ని మాధ్యమాలు నిస్సిగ్గుగా ప్రవర్తించడం వారిలో కరడుగట్టిన నీచప్రవృత్తికి, అధమాధమ చీకటి కోణానికి పరాకాష్ట.
స్వీయనియంత్రణ మరచి సంస్కార విహీనంగా రాతలు రాయడం ఆటవికుల లక్షణం. అనాగరిక చేష్టలతో చదువరులలో అనవసర అయోమయ సందిగ్దత సృష్టించడం వెనుక ఉన్న స్వార్ధపర కుయుక్తులకు కళ్ళెం వేయాలని మేధావులు ఇటీవల నియంత్రణ వ్యవస్థకు సూచించారు.
చదువరులలో ఆసక్తిని రేకెత్తించి, కాసులు సంపాదించాలనుకోవడం హీనాతిహీనమైన దుశ్చర్యగా వారు విమర్శించారు. బాలు వంటి విఖ్యాతులనే కాదు..సామాన్యుల వ్యక్తిగత జీవితాలలోకి నిరభ్యంతరంగా చొచ్చుకుపోతున్న సామాజిక మాధ్యమాలను కఠినంగా శిక్షించాలని… తద్వారా భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు పరిపూర్ణ అర్ధాన్ని నిర్వచించాలని మీడియాకు చెందిన ప్రాజ్ఞులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న సామాజిక మాధ్యమాలకు కనీస పాత్రికేయ వృత్తిధర్మం , నిబద్ధత లోపించడం క్షమార్హం కాదని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
‘అతిసర్వత్రా వర్జేయాత్ ‘ అనే నానుడి అన్నిరకాల మాధ్యమాలకూ వర్తిస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు..ఇప్పటికే…. పలురకాల సంఘర్షణలతో సమాజం సతమతమవుతున్న క్లిష్ట సమయంలో మాధ్యమాల దూకుడుకు కళ్ళెం వేయాలనే అభిప్రాయం సర్వత్రా ముక్తకంఠంతో వ్యక్తమవుతోంది.
– పొలమరశెట్టి కృష్ణారావు