ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా… సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు, వాటికి పాల్పడ్డ యాక్టివిస్టులపై పోలీసులు తీసుకుంటున్న చర్యలు…తదితరాలపైనే చర్చ సాగుతోంది. మొన్నటిదాకా ఈ విషయాన్ని అంతగా పట్టించుకోని కూటమి సర్కారు…పవన్ కల్యాణ్ నోరు విప్పడంతో ఒక్కసారిగా జూలు విదిలించడం మొదలుపెట్టిందనే చెప్పాలి. సాధారణంగా ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా… తన ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారిపైనే ఈతరహా చర్యలకు ఉపక్రమిస్తుంది.
గడచిన ఐదేళ్లలో జరిగిన పరిణామాలు చూస్తే…ఈ మాట నిజమేనని ఒప్పుకోక తప్పదు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై దూషనలకు పాల్పడ్డారన్న కారణంతో పలువురు సోషల్ మీడియా యాక్టివిస్టులను వైసీపీ సర్కారు అరెస్ట్ చేసింది. అయితే టీడీపీ నేతలపై దారుణంగా పోస్టులు పెట్టిన వైసీపీ యాక్టివిస్టుల్లో ఒక్కరంటే ఒక్కరిపైనా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. అయితే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇప్పుడు సరికొత్త తరహా చర్యలకు శ్రీకారం చుట్టారు.
జూలు విదిలిస్తున్న పోలీసులు
ఆదర్శవంతమైన పాలనకు నాందీ పలికారు. నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరరీతిలో పోస్టులు పెడుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను ఏపీ పోలీసులు వరుసగా అరెస్ట్ చేయడంతో పాటుగా వారిని కోర్టుల్లో హాజరుపరచి జైలుకు తరలిస్తున్నారు. ఇప్పటికే ఈ దిశగా వందల కేసులు నమోదు కాగా… పదుల సంఖ్యలో యాక్టివిస్టులు అరెస్టయ్యారు. అరెస్టైన వారిలో చాలా మంది ప్రస్తుతం జైళ్లలో ఉంటున్నారు.
ఇలాంటి కీలక తరుణంలో చంద్రబాబు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఎలాగైతే చర్యలు తీసుకుంటున్నారో… అదే మాదిరిగా వైసీపీ నేతలపైనా అసభ్యకర పోస్టులు పెట్టే టీడీపీ, జనసేన,బీజేపీలకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులపైనా అదే తరహా చర్యలు తీసుకోవాలంటూ ఆయన పోలీసు శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. చంద్రబాబు నుంచి వచ్చిన ఈ ఆదేశాల మేరకు ఓ టీడీపీ యాక్టివిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు కూడా.
టీడీపీ వారిని కూడా వదలడం లేదు
వైసీపీ నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టాడన్న కారణంగా టీడీపీ అభిమానిగా కొనసాగుతున్న మన్విత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి పెమ్మసాని శరణ్య సోషల్ మీడియా వేదికగానే ధృవీకరించారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే… టీడీపీ అభిమానిని కూడా చంద్రబాబు సర్కారు వదలలేదని, అందులో భాగంగా తప్పుడు పోస్టులు, మార్ఫింగ్ లు,అసభ్య పోస్టులు పెట్టిన మన్విత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారంటూ ఆమె తెలిపారు.
ఈ లెక్కన ఇకపై సోషల్ మీడియాలో వెర్రి తలలు వేసే యాక్టివిస్టులు.. వైసీపీ వారైనా, టీడీపీ వారైనా, జనసేన వారైనా, బీజేపీ వారైనా, ఇంకే పార్టీలకు చెందిన వారైనా కఠిన దండనను ఎదుర్కోక తప్పదన్న భావన కలిగేలా చంద్రబాబు సర్కారు ఓ సత్సంప్రదాయానికి తెర తీసిందని చెప్పక తప్పదు. అసలు రాజకీయాల్లో తన, పర బేధమన్నది లేకుండా వ్యవహరించే నేతలు చాలా అరుదు అనే చెప్పాలి. తన వారు ఎంతటి తప్పు చేసినా… తమ రాజకీయ పబ్బం గడవడమే పరమావధిగా సాగుతున్న నేతలు వారిని వెనకేసుకుని వస్తూ ఉంటారు.
చివరకు హత్యలు చేసిన అనుచరులను కూడా కాపాడేందుకే యత్నిస్తారు. అయితే ఈ తరహా స్వార్థ రాజకీయాలకు ఎప్పుడూ అల్లంత దూరం పాటించే చంద్రబాబు…తాజాగా తీసుకున్న నిర్ణయం సమకాలీన రాజకీయాల్లో కీలక అడుగేనని చెప్పక తప్పదు. అంతేకాకుండా చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇతర పార్టీలు కూడా ఆదర్శంగా తీసుకుంటే… స్వార్థ రాజకీయాలకు పాతర పడిపోయినట్టేనని చెప్పక తప్పదు. మరి ఎంతమంది చంద్రబాబు మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతారో చూద్దాం.