36.2 C
Hyderabad
April 16, 2024 22: 54 PM
Slider ఆధ్యాత్మికం

రేపే చూడామణి నామక సూర్యగ్రహణం

#Solar Eclips Image

(సత్యం న్యూస్.నెట్ ప్రత్యేకం)

గత ఏడాది డిసెంబర్ 26న ధనస్సు రాశిలో సూర్య గ్రహణం ఏర్పడింది. అప్పుడు షష్ఠగ్రహ కూటమి కూడా ఏర్పడుతుందని, ఉపద్రవాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రజలు అందరు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచించారు. పండితులు సూచించిన విధంగానే కరోనా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నది. ఇప్పుడు షష్ఠగ్రహ కూటమి లేదు కానీ సూర్యగ్రహణం మాత్రం మళ్లీ సంభవిస్తున్నది.

శ్రీశార్వరినామ సంవత్సరం జ్యేష్ఠ అమావాస్య ఆదివారం మృగశిర -4 , ఆరుద్ర -1 పాదాలు మిథున రాశి లో రాహుగ్రస్త అంగుళ్యాకారంలో సూర్య గ్రహణం సంభవిస్తున్నది. ఆ రోజు ఉదయం 11:58కు గ్రహణం పడుతుంది. ఈ గ్రహణం మన దేశంతో పాటు ఆసియా, ఉత్తర ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్రికాలలో కూడా కనిపిస్తుంది.

డెహ్రాడూన్ లో సంపూర్ణ గ్రహణం

చాలా ప్రాంతాల్లో పాక్షికంగా కనిపిస్తుంది. డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్) లో సంపూర్ణంగా కనిపిస్తుంది. మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాల వారు, మిథునరాశి వారు ఈ గ్రహణం అసలు చూడరాదు. తెలంగాణ రాష్ట్రానికి గ్రహణ ఆరంభ కాలం : ఉ. 10.14 గ్రహణ మధ్యకాలం : ఉ .11.55 గ్రహణ అంత్యకాలం : మ.1.44 గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 30 నిమిషాలు.

ఆంధ్ర రాష్ట్రానికి గ్రహణ ఆరంభకాలం : ఉ.10.23 గ్రహణ మధ్యకాలం : మ.12.05 గ్రహణ అంత్యకాలం : మ.1.51 గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 28 నిమిషాలు. గ్రహణం రోజు ఉదయం 6 గంటలకే అందరూ అన్నపానాదులు ముగించాలి.

ఈ నక్షత్రాల వారు గ్రహణం చూడవద్దు

వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం  ఉదయం 8 గంటల వరకు తినవచ్చు. అది కూడా అల్పాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ గ్రహణం మిధున రాశి వారు  మృగశిర, ఆరుద్ర  పునర్వసు  నక్షత్ర జాతకుల వారు ఎట్టిపరిస్థితుల్లోనూ చూడరాదు.

గ్రహణ పట్టు ,మధ్య , విడుపుస్నానాలు ఆచరించే వారు యాధావిధిగా స్నానం ఆచరించి,మంత్రానుష్టానములను నిర్వహించుకొవచ్చును. గ్రహణం సమయంలో ఎవరి నక్షత్ర జపం వారు చేసుకోవచ్చును. లేదా మీకు ఏదైనా మంత్రానుష్టానం ఉంటే ఆ మంత్రం జపం చేసుకోవచ్చు.

సూర్య గాయత్రి మంత్రం

లేదా సూర్య గాయత్రి మంత్రం జపం చేసుకోవచ్చు. సూర్య గాయత్రి – ఓం ఆదిత్యాయచ విద్మహే మహా శుభగాయచ ధీమహి, తన్నోఆదిత్య ప్రచోదయాత్. గ్రహణం రోజు మధ్యాహ్నం గ్రహణం విడుపు తర్వాత అంటే మధ్యాహ్నం 2  గంటలకు ఇల్లు శుభ్రంగా కడిగి, స్నానం చేసే నీళ్ళలో చిటికెడు పసుపు, రెండు హారతి కర్పూరం బిళ్లల్ని చూర్ణం చేసుకుని నీళ్ళలో వేసుకుని తల స్నానం చేసుకోవాలి.

ఆ తర్వాత ఇంట్లో ఉన్న పూజాగదిని శుభ్ర పరచుకుని గాయత్రి ( జంధ్యం ) ని మార్చుకుని, దేవత విగ్రహాలను, యంత్రాలను “పులికాపి” చేయాలి. శుద్ధమైన నీళ్ళలో చిటికెడు పసుపు వేసి దేవుని విగ్రహాలు,యంత్రాలు ప్రోక్షణ చేసి దీపారాధన అలంకరణం చేసి మహా నైవేద్యం కోసం బెల్లంతో చేసిన మరమాన్నం వండి దేవునికి నివేదన చేసి హారతి ఇచ్చి మనస్సును ప్రశాంతగా ఉంచుకుని మూడు ప్రదక్షిణలు నిధానంగా చేసి మనస్సులో సమస్త గ్రహాదోష నివారణ కలిగించమని సాష్టాంగా నమస్కారం చేస్తూ విన్నవించుకోవాలి.

మహిళలు సాష్టాంగం చేయవద్దు

ఆడవారు సాష్టాంగ నమస్కారం ఎప్పుడు ,ఎక్కడ చేయకూడదు. ఆడవారు కేవలం మోకాళ్ల పైనే చేయాలి. ముఖ్యంగా గర్భిణిలు నిలబడే నమస్కరించుకోవాలి. ముఖ్యంగా గర్భవతులు ఎలాంటి భయందోళన పడవలసిన అవసరం లేదు. గర్భవతులు ఎవరైన గ్రహణం ప్రత్యక్షంగా చూడ కూడదు, మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మీకు మరీ మంచిది.

గ్రహణ సమయంలో కదలకూడదు, మల ,మూత్ర విసర్జన చేయకూడదు. గ్రహణం ప్రారంభానికి ముందే కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఎవరినైనా పెద్దవారిని పక్కన కూర్చోబెట్టుకుని వారి ద్వారా సపర్యలు పొందాలి. ఇంట్లో పూజ అయిన తర్వాత గుడికి, దైవ దర్శనాలకు వెళ్ళే వారు వెళ్ల వచ్చును.

దోష నివారణకు మార్గాలు

మిధున, కర్కాటక,వృచ్చిక మీన రాశుల వారు తగు గ్రహాణ దోష పరిహార ప్రక్రియలను మీకు అనుకూలమైన పండితులను సంప్రదించి దోష పరిహార జప, దానాదులను చేసుకోవాలి. ద్వాదశ రాశుల వారు గోమాతకు బియ్యం, తోటకూర,బెల్లం గోధుమలు కలిపి ఆవుకు తినిపించాలి.

గోమాత మనం పెట్టిన ధాన్యం తినేప్పుడు మూడు ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయ లేదా కొబ్బరి కాయలను గుమ్మంపై నుండి తీసివేసి మళ్లి కొత్త వాటిని అనుభవజ్ఞులైన పండితులచే పూజించి ఇంటికి, వ్యాపార సంస్థలకు కట్టుకోవాలి.

గ్రహణం తర్వత మనం ఇంటి రక్షణ కోసం కట్టిన గుమ్మడి,కొబ్బరి కాయలు శక్తి కోల్పోతాయి. కాబట్టి తిరిగి మనకు,మన కుంటుబ సభ్యుల కోసం, ఇంటికి, వ్యాపార సంస్థల రక్షణ కొరకు తప్పక కట్టుకోవాలి.

శుభఫలం: మేష , మకర , కన్య , సింహ రాశులకు

మధ్యమ ఫలం: వృషభ , కుంభ , ధనుస్సు , తుల రాశులకు

అధమ ఫలం: మిథున , మీన , వృశ్చిక , కర్కాటక రాశులకు వారికి అధమ ఫలం .

మిథున రాశి వారు ఖచ్చితంగా గ్రహణ శాంతి చేయించుకోవాలి

మనీష్, చీపురుపల్లి, విజయనగరం జిల్లా

Related posts

శిథిలావస్థకు చేరుకుంటున్న మోడల్ కాలనీ ఇండ్లు

Satyam NEWS

మానవత్వం చాటుకున్న కోల్లపూడి యోహాన్

Satyam NEWS

77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 380 మందికి అవార్డులు

Satyam NEWS

Leave a Comment