రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ ప్రారంభోత్సవంలో సీఎం
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలన్నదే ప్రజా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ నిరుద్యోగ సమస్య అయితే తెలంగాణ ఆకాంక్షకు బలమైన కారణమైందో ఆ సమస్యను పరిష్కరించే దిశగా అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన జాబ్ క్యాలండర్‌ను ప్రకటించబోతున్నామని చెప్పారు.
ప్రతి ఏటా మార్చి 31 లోగా అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను తెప్పించి జూన్ 2 నాటికి నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9 లోపు నియామక పత్రాలను ఎంపికైన అభ్యర్థుల చేతుల్లో పెట్టాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని సీఎం చెప్పారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన “రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం” కార్యక్రమాన్ని సీఎంగారు లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. సింగరేణి సంస్థ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో సివిల్స్‌లో ప్రిలిమ్స్ సాధించి మెయిన్స్‌కు ఎంపికైన యువతీ యువకులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తారు.
“నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తుందని ముందు ప్రభుత్వంపై విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఈ ప్రభుత్వం కచ్చితంగా, సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించి సమర్థులైన వారిని ఎంపిక చేస్తుందన్న నమ్మకం రావాలి. ఎంపికలోనూ కచ్చితంగా సామాజిక న్యాయం పాటిస్తుంది. ఎస్సీ, ఎస్టీ ఓబీసీ, మహిళా రిజర్వేషన్లు పాటిస్తుంది. ఎలాంటి అపనమ్మకాలు అవసరం లేదన్న భావన రావాలి. సంస్థపై నమ్మకం ఉంటే నిరుద్యోగుల ఫోకస్ అంతా ప్రపిరేషన్‌పై ఉంటుంది” అని ముఖ్యమంత్రి వివరించారు.
గ్రూప్ I, II, III, ప్యారా మెడికల్, పోలీస్, డీఎస్సీ, టెట్… ఇలా ఏ పరీక్షలైనా సరైన సమయంలో సమర్థవంతంగా నిర్వహించాలన్నదే ప్రభుత్వ ప్రాధాన్యత అని సీఎం చెప్పారు. కష్టపడే విద్యార్థులకు ఈ ప్రభుత్వం భుజం తడుతుందని భరోసానిచ్చారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే చిత్తశుద్ధితో 30 వేల ఖాళీలను భర్తీ చేసి నియామక పత్రాలను అందజేసిన విషయాన్ని గుర్తుచేస్తూ దాన్ని బట్టి ప్రభుత్వ ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చని తెలిపారు.
నాడు తెలంగాణ అంటే నిరుద్యోగానికి పర్యాయపదంగా ఉండేదని, తెలంగాణ ఏర్పడినప్పుడు 20, 22 ఏళ్ళ వయసున్న యువకులు ఉద్యోగం కోసం గత పదేళ్లలో ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆనాడు జరిగిన అనేక పొరపాట్ల వల్ల ఏ పరీక్షా సమయానికి జరక్క, పరీక్షా పత్రాలు లీకయి పల్లి బఠాణీల్లా మార్కెట్‌లో దొరకడం వంటి అనేక పరిణామాల వల్ల వారిలో నమ్మకం సన్నగిల్లడమే కాకుండా వారి జీవితంలో పదేళ్ల విలువైన కాలం వృధా అయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ నుంచి UPSC2024 లో విజయం సాధించిన అభ్యర్థులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జ్ఞాపికను అందజేసి అభినందించారు.