పెట్రోలింగ్,బ్లూ కోల్ట్స్ వాహనాలతో నిత్యం రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. రోడ్లపై ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తీసుకుంటామని అయన చెప్పారు. సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలని సూచించారు.
ప్రతీ గ్రామాన్ని పోలీస్ అధికారులు సందర్శించి గ్రామాలలో పూర్తి స్ధాయిలో నిఘా ఉంచి ఎప్పటికప్పుడు నేరాలకు సంబంధించిన సమాచారం ముందస్తుగా తెలుసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో జిల్లాలోని డిఎస్పీలు, సీఐలు,అన్ని పోలీస్టేషన్ల ఎస్సైలతో జిల్లా ఎస్పీ నెలవారి నేరసమీక్ష సమావేశం నిర్వహించి పెండింగ్ కేసులు తెలుసుకుని చాలా కాలం నుండి పెండింగ్ లో ఉన్న కేసులను సంబంధిత అధికారులు పూర్తి చేయాలని, పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఎఫ్.ఎస్. ఎల్ రిపోర్ట్స్, మెడికల్ సర్టిఫికెట్ త్వరగా తెప్పించి కేసులు చేదించాలన్నారు.
గ్రామాలలో సమస్యలు సృష్టించే వారిని ముందుగానే గుర్తించి చర్యలు చేపట్టాలని అన్నారు. ఇసుక, పీ.డి.ఎస్ రైస్ అక్రమ రవాణా, పేకాట జరగకుండా నిఘా ఉంచి కేసులు నమోదు చెయలన్నారు. గంజాయి అక్రమరవాణా, మట్కా, బెట్టింగులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు , డిసిఆర్బి డిఎస్పి ఉమా మహేశ్వరరావు , పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోపాల్ రెడ్డి, వనపర్తి సిఐ క్రిష్ణ, కొత్తకోట సీఐ రాంబాబు, ఆత్మకూర్ సిఐ శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, డిసిఆర్బి సిబ్బంది, ఐటి కోర్ సిబ్బంది, కార్యాలయం సిబ్బంది ఉన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్