39.2 C
Hyderabad
April 25, 2024 17: 44 PM
ప్రత్యేకం

Analysis: స్వాతంత్ర్యంలో సగ భాగం స్వార్ధపరులకే

#IndependenceDay

పండుగలా చేసుకునే స్వాతంత్ర్య దినోత్సవం నేడు  జరుపుకుంటున్నాం. 1947 ఆగస్టు 15 వ తేదీ నాడు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. 73ఏళ్ళు పూర్తయ్యాయి, 74వ ఏట అడుగుపెడుతున్న సందర్భం. ఈరోజు మనం అనుభవించే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఎందరో వీరుల త్యాగఫలాలు.

ఇది ఆషామాషీగా వచ్చింది కాదు. భారతీయులు దశాబ్దాలపాటు అనేక ఘోర అవమానాలకు, అన్యాయాలకు గురిఅయ్యారు. ఆక్రందనలు చేశారు. హాహాకారాలు పెట్టారు. ధనమానాలు పోగొట్టుకున్నారు. భారతీయ సంస్కృతి,సంపద దోపిడీకి గురైంది.

వ్యాపార నెపంతో వచ్చి వందల ఏళ్ల దాష్టీకం

ఏళ్ళ తరబడి సాగిన బానిసత్వం నుండి బయటకు వచ్చిన గొప్ప సందర్భం ఇది. బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం నెపంతో అడుగుపెట్టి, మెల్లగా భారతదేశాన్ని దురాక్రమించుకున్నారు. ఈ దురాక్రమణల పర్వం వందల ఏళ్ళపాటు సాగింది. ఆ  కబంధ హస్తాల నుండి బయటపడి, ఇనుప సంకెళ్ళ తెంచుకున్న రోజు ఇది.

దీన్ని పండుగగా  భావిస్తున్నాం.ప్రతిఏటా,ఢిల్లీలోని  ఎర్రకోట మొదలు దేశమంతా మన జాతీయ జెండా ఎగురువేసి వేడుకలు  జరుపుకుంటున్నాం. దేశం మొత్తం ఎగురువేసే ఈ జెండాను తయారుచేసింది మన తెలుగువాడు పింగళి వెంకయ్య. స్వాతంత్ర్య సాధనలో తెలుగువారి పాత్ర అమూల్యమైంది.

ఈ పోరాటంలో, ఈ సాధనలో ఎందరో తమ ఆరోగ్యం, ఆస్తులు, ఆయుష్షు పోగొట్టుకున్నారు. వందలాది ఎకరాల భూములను, లక్షలాది రూపాయల ఆదాయాన్ని దేశ స్వేచ్ఛా స్థాపనకు వదిలివేసిన పుణ్యచరితులు, ధన్యకీర్తులు మన భారతీయులు, మన  తెలుగు వారు.

గాంధీ కలలు కన్న సురాజ్యం అనుభవిస్తున్నామా?

గాంధీజీ మొదలు ఈ మహనీయులందరూ కలలు కన్న సురాజ్యాన్ని మనం నేడు అనుభవిస్తున్నామా, అని ప్రశ్న వేసుకుంటే, లేదనే చెప్పాలి. ప్రజాస్వామ్యం,రాజ్యంగ హక్కులు కొందరికే పరిమితమయ్యాయి. అవినీతి, బంధుప్రీతి, అరాచకం,అసమానతలు అంతటా ఆవులిస్తున్న ఆవరణలో మనం జీవిస్తున్నాం.

స్వరాజ్యంలో సురాజ్యం ఎక్కడ, అని వెతుక్కోవాలి. ప్రతి రంగంలో విలువలు కనుమరుగవుతున్న కాలంలో, ఈ స్వరాజ్యం ఎవరి కోసం అనే ప్రశ్నలు లక్షల  మెదళ్లను తొలుస్తున్నాయి. ఒకప్పుడు ఎంతో సుసంపన్నమైన దేశం మనది. విజ్ఞానఖనులు విహరించిన వివేక భూమి.

క్రమంగా ఆ శక్తులు తగ్గుతూ వచ్చాయి. అర్హవిద్యలు మృగ్యమయ్యాయి. రాజ్యాంగం అనేకసార్లు సవరణలకు గురైంది. ఇంకా కొన్ని హక్కులను పునః నిర్మించుకోవాల్సిన, పునః నిర్వచించుకోవాల్సిన  పరిస్థితుల్లో ఉన్నాం.నైతికత ప్రశ్నగా మారింది.సాంకేతికంగా ముందుకు వెళ్తున్నాం.సాంస్కృతికంగా వెనక్కుసాగుతున్నాం.

అంకెలలోనే కనిపిస్తున్న అభివృద్ధి

ఈ ఏడున్నర దశబ్దాల్లో అంకెల్లో అక్షరాస్యత పెరిగింది. జ్ఞానం తగ్గుముఖం పట్టింది. డిగ్రీలు కేవలం సర్టిఫికెట్లుగానే మారిపోయ్యాయి. ఉన్నపళంగా కొందరు కోటీశ్వరులై పోయారు. ఎందరో పేదలుగానే మిగిలివున్నారు. కనీస వసతులు,సౌకర్యాలకు దూరంగానే  కోట్లాదిమంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు.

రాజకీయం మరీ క్రూరంగా మారిపోయింది. ఖరీదయిన వ్యాపారం అని అభివర్ణించే స్థాయికి చేరింది.పరిపాలన పట్ల అవగాహన, విలువలు ఉన్న వ్యక్తులు రాజకీయాల్లోకి రావడానికి భయపడుతున్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలుగా విడిపోయిన గోడల మధ్య రాజకీయపార్టీలు నడుస్తున్నాయి.

ఆ మధ్య ఓ కవి “స్వరాజ్యమొక మేడిపండు” అన్నాడు.నాలుగు ప్రధాన సౌధాలు/స్థంభాల పట్ల  సగటుమనిషికి విశ్వాసం సన్నగిల్లుతున్న కాలంలో మనం ఉన్నాం. ఈ మూల వ్యవస్థల పట్ల గౌరవం, విశ్వాసం, అభిమానం, ప్రేమ పెంచాల్సిన బాధ్యత పాలకులదే.

హక్కులు కాపాడండి అని అడిగే దుస్థితి ఇంకానా…..?

సరియైన పాలకులను ఓటుహక్కు ద్వారా ఎంచుకోవాల్సిన బాధ్యత మళ్ళీ ప్రజలదే. యధా రాజా ! తధా ప్రజా నుండి యధా ప్రజా! తధా రాజా వైపు సమాజం మళ్లుతోందని కొందరు మేధావులు గగ్గోలు పెడుతున్నారు.వి కాసాన్ని పెంచే విద్య, విశ్వాసాన్నే పెంచే పాలన ఉన్నప్పుడే సురాజ్యం సాధించినట్లు.

నిజమైన స్వరాజ్యం వచ్చి నట్లు. ప్రజాస్వామ్యాన్ని రక్షించండని కొందరు, ప్రాధమిక హక్కులు కాపాడండని కొందరు ఉద్యమాలు చేస్తున్న తరుణంలో మనం ఉన్నాం. మన పాలకుల ఉదాసీనత వల్ల, భారతదేశం ఎదగాల్సినంతగా ఎదగలేదు.

ఒకప్పుడు మన కంటే ఎంతో వెనకాల ఉన్న  చైనా, ఇప్పుడు మనల్ని దాటి చాలాముందుకు వెళ్ళిపోయింది.కటిక పేద దేశమైన నేపాల్, మనకంటే చాలా కిందన ఉండే పాకిస్తాన్ కూడా మనల్ని బెదిరిస్తున్నాయి. అగ్రరాజ్యంగా అవతరించిన అమెరికా తన అవసరాలకు తగ్గట్టుగా మనతో ఆడుకుంటోంది.

ఈ ఏడున్నర దశాబ్దాలలో ప్రపంచ చిత్రపటం పూర్తిగా మారిపోయింది. బండ్లు ఓడలయ్యాయి. ఓడలు బండ్లయ్యాయి. మనం మధ్యలో ఉన్నాం.ఇన్నేళ్లల్లో,   చిత్తశుద్ధిగా,శక్తివంతంగా మన పాలకులు దేశాన్ని ఏలివుంటే, నేటి చైనా స్థానంలో మనం ఉండే వాళ్ళం. భారత్ ఈపాటికే అగ్రరాజ్యంగా అవతరించి ఉండేది.

సహజ వనరులు సద్వినియోగం చేసే ప్రయత్నం ఏదీ….?

మన పాలకులు తమ అధికారంపై పెంచుకున్న మోజులో,పెట్టిన శ్రద్ధలో, చేసిన శ్రమలో  సగం దేశంకోసం వెచ్చించి ఉన్నా, ఈ పాటికి భారతదేశం అగ్రరాజ్యంగా రెపరెపలాడుతూ ఉండేది. మనకున్న సహజవనరులు, మానవ వనరులు అమెరికా, చైనా కంటే చాలా ఎక్కువ.

ఇప్పటికైనా సద్వినియోగం చేసుకుంటే అమెరికా, చైనాల సరసన త్వరలోనే చేరుతాం. స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు అందరికీ లభించి, రాజ్యాంగం కల్పించిన హక్కులు అందరికీ ఫలించి, ప్రజాస్వామ్యం ప్రజలందరిలో పరిఢవిల్లి, స్వరాజ్యం  సురాజ్యంగా మారినరోజు మనకు నిజమైన పండుగరోజు.ఆ రోజులు త్వరలోనే  రావాలని  ఆశిద్దాం.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

మునిసిపల్ ఎన్నికలలో ఓటు వేయడం మన బాధ్యత

Satyam NEWS

శబరిమల యాత్రకు టిఎస్ ఆర్టిసి ప్రత్యేక అద్దె బస్సులు

Satyam NEWS

హోల్సిమ్ వాటాలు కొనుగోలు చేసిన అదానీ

Satyam NEWS

Leave a Comment