24.7 C
Hyderabad
October 26, 2021 05: 04 AM
Slider సినిమా

Special interview: ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అవసరమా?

#sanjeev

కరోనా లాక్ డౌన్ సమయంలో సినిమా ధియేటర్లు మూతపడి పోవడంతో ఓటీటీ ప్రాధాన్యత అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుంచి ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కొత్త పోకడలు సంతరించుకుంటూ అత్యధిక సినిమాల విడుదలకు వేదికగా నిలిచింది. నారప్ప, టక్ జగదీష్ లాంటి అగ్రనటుల సినిమాలు కూడా ధియేటర్లలో కాకుండా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ పై విడుదల అవుతుండటంతో మరింత క్రేజ్ పెరిగింది.

అదే సమయంలో ధియేటర్ యజమానులు ఓటీటీ లో సినిమాలు విడుదల చేసే నిర్మాతలపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ దర్శకుడు సంజీవ్ మేగోటి తో సత్యంన్యూస్.నెట్ ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే…..

ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఖచ్చితంగా అవసరమే అనేది నా అభిప్రాయం … ఎందుకంటే నేను ఇండస్ర్టీకి వచ్చిన కొత్తల్లో ఐడియాను షేర్ చేసుకుని దాన్ని ఒక నిర్మాతకి ఒప్పించి సినిమాగా తియ్యడానికి ఎన్నో ఏళ్ళు పట్టేది. ఒక వేళా సినిమా తీసినా దాన్ని బిజినెస్ చెయ్యడానికి, జనాల్లోకి తీసుకురావడానికి ఒకే ఒక్క ఆప్షన్ థియేటర్. ఒక సినిమా థియేటర్ లో రిలీజ్ అవుతుందంటే జనాలకి పండగలా ఉండేది.

థియేటర్ రిలీజ్ అంటే నిర్మాతకు ప్రసవ వేదనే….

నిర్మాతకి ప్రసవ వేదనలా ఉండేది. నిర్మాత ఒక పెద్ద హీరో డేట్ లు తీసుకుని … కోట్లల్లో ఖర్చుపెట్టి ఆ పెట్టుబడిని కేవలం ప్రేక్షకుల మీద రాబట్టుకునేవాడు. సినిమా బావుంది హిట్ అనిపించుకుంటే తప్ప దానికి డబ్బు వచ్చేది కాదు. ఫైనాన్షియర్ల ఒత్తిడి, డిస్టిబ్యూటర్ ల ఒత్తిడి … అభిమానుల ఒత్తిడి ఇలా అన్ని రకాలుగా నిర్మాత ఒత్తిడికి గురయ్యేవాడు. హిట్ అయితే వెలిగిపోయేవాడు. లేదంటే చీకటిలో కలిసిపోయేవాడు.

పెద్ద హీరో సినిమాలు తప్ప చిన్న హీరో లేదా కొత్త హీరో సినిమాలు కొనేనాథుడు ఉండేవాడు కాదు.  కాలక్రమేణా శాటిలైట్ రైట్స్ వల్ల .. డబ్బింగ్ రైట్స్ వల్ల కొంత  పెట్టుబడి రాబట్టుకునేవాడు … అదికూడా కేవలం పెద్ద హీరోల సినిమాలకు లేదా ఒక మోస్తరు రేంజ్ ఉన్న హీరోలకు…పెద్ద సినిమా తీసినా చిన్న సినిమా చేసినా డైరెక్టర్, నిర్మాత … ఆ సినిమా తాలూకు సాంకేతిక వర్గం పడే కష్టం ఒకటే … కానీ టెన్షన్ మాత్రం కేవలం చిన్న నిర్మాతలకి , కొత్త దర్శకులకి ఉండేది.

…. కథను నమ్ముకుని ఓడిన వారే ఎక్కువ…..

మార్కెట్ రేంజ్ ఏంటో తెలీకుండా … ఎలా అమ్ముకోవాలో తెలీకుండా కేవలం ఒక కథను లేదా ఒక ఐడియా ని నమ్ముకుని ఆస్తులు అమ్ముకుని సినిమా తీసి గెలిచినా వాళ్ళు పదిశాతం అయితే ఓడిపోయిన వాళ్ళు తొంభయిశాతం మంది ఉన్నారు. సినిమా తీయాలనుకోవడం వేరు. సినిమా మీద అవగాహన లేకుండా తీయడం వేరు. ముఖ్యంగా మార్కెట్ గురించి తెలుసుకోకపోవడం వల్ల ఎంతో మంది నష్టపోయారు, పోతున్నారు.  

ఇప్పుడు సినిమా స్టాండర్డ్స్ మారిపోయాయి. డిజిటలైజేషన్ అయ్యింది. చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చాక ప్రేక్షకుడి దృక్పధం మారిపోయింది. ఒకప్పుడు కుటుంబ సమేతంగా  సినిమా థియేటర్ కి వెళ్లి సినిమా చూడ్డం…ఎంతో ఆహ్లాదంగా ఉండేది. శని,ఆదివారాలు వస్తే చాలు సినిమా థియేటర్ల ముందు వాలిపోయేవాళ్లు…

కానీ ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో శని ఆదివారాలు అంటే ఏంటో తెలీని స్థితికి యువత చేరుకుంది. చాలా బిజీ అయిపోయారు. వర్క్ ఫ్రం హోమ్. ఇంటిదగ్గరినుంచే ప్రపంచాన్ని చూసేస్తున్నారు. అన్నిపనులు ఇంటిదగ్గరినుంచే చక్కబెట్టుకుంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లకు ఉన్న ఎంటర్టైన్మెంట్ కుటుంబంతో గడపడం. ఆ కుటుంబంతో పాటు ఎంజాయ్ చెయ్యడం.

థియేటర్ కు వెళ్లే సమయంలేని వారికి ఓటీటీ ఓ వరం….

అలా ఎంజాయ్ చెయ్యాలి అంటే వాళ్లకు ఎంటర్టైన్మెంట్ కావాలి. కానీ థియేటర్ కి వెళ్లి సినిమా చూసి వచ్చేంత టైం కూడా లేదు. ఎందుకంటే ఓ పక్క వర్క్ ఫ్రం హోమ్ అలాగే బయటకి వెళితే  ఇప్పుడున్న పరిస్థితులు. వాళ్లకు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ టీవీ… టీవీలో ఎంటర్టైన్మెంట్ అంటే సీరియల్స్ అండ్ సినిమాలు …ఆ సినిమాలన్నీ గతంలో థియేటర్ లకు వెళ్లి చూసినవే … కొత్తగా థియేటర్ లకు వెళ్లి సినిమాలు చూడలేని పరిస్థితి ప్రేక్షకులది.

ఇలాంటి పరిస్థితిలో వచ్చిందే ఓటీటీ ప్లాట్ ఫామ్. గతంలో ఓటీటీ ఉన్నా అది కేవలం కొంతమందికే తెలుసు … లేదా స్మార్ట్ ఫోన్లు ఉన్న వాళ్ళు చూసేవాళ్ళు … వెబ్ సిరీస్ … వెబ్ మూవీస్ ..ఇలా  ఉండేవి … ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ రావడం వల్ల ఎంతోమంది వెలుగులోకి రాని నటీనటులు ప్రేక్షకులకి చేరువ అవుతున్నారు.

నిర్మాతలకు అదనపు ఆదాయం తెచ్చిపెడుతున్న కొత్త వనరు…..

అలాగే నిర్మాతలకి ఇదొక ఆదాయవనరుగా ఉపయోగపడుతోంది. అన్నిటికన్నా ముఖ్యంగా చిన్న నిర్మాతలకు , కొత్త దర్శకులకు చాల ఉపయోగకరంగా ఉంది. ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్టు ప్రపంచభాషల సినిమాలు … మన నట్టింట్లో కాదు…  కాదు …మన ‘నెట్టింట్లో’ కి వచ్చి కుటుంబాన్ని ఆహ్లాదపరుస్తూ ఉన్నాయి.

థియేటర్ రెంట్ లు కట్టి చిన్న సినిమాలను ఆడించే స్థోమతలేని ఎంతో మంది నిర్మాతలకు ఓటీటీ రావడం ఒక వరం. కథను నమ్ముకుని సినిమా తీసే నిర్మాతలకు అమ్ముకుని సొమ్ము చేసుకోడానికి ఇది ఎంతో మంచి వేదిక…  అలాగే ఎదుగుతున్న దర్శకులకి , దర్శకత్వం చేయాలనుకునే యువతకి కథల విషయంలో ఎన్నో మార్పులు గమనించడానికి … వాళ్ళ వాళ్ళ దృష్టి కోణంలో కొత్త కథల్ని ఆవిష్కరించడానికి ఉపయోగపడుతున్నది ఈ ప్లాట్ఫామ్ …

మూస దోరణి లేకుండా…. కొత్త కథలు… కొత్త అంశాలతో….

మూస ధోరణిలో వచ్చిన సినిమాలకు చరమగీతం పాడింది ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్. కథల విషయం లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యాల్సిన అవసరం అందరికీ వచ్చింది. ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా సినిమాలు తీయడానికి యుద్ధప్రాతాపదికన సన్నద్ధమవ్వాల్సిన అవసరం కూడా ఏర్పడింది సినిమా ఇండస్ట్రీకి … సాంకేతిక వర్గానికి. ఆ మార్పు చాలా మంచిది. కొత్తతరానికి ఆలంబనగా నిలిచింది ఈ కొత్త ప్లాట్ ఫామ్.

చిన్న నిర్మాతలకు ఊపిరయ్యింది ఈ వేదిక. మాయమయి పోతుందకున్న సినిమా తల్లిని బ్రతికించిన ఈ వేదిక ఇంకా శిశుదశలోనే ఉంది. అయినా ఎంతో మంది దర్శకులకు సాంకేతిక నిపుణులకు సృజనాత్మకత పెంచుకోడానికి   ఉపయోగపడుతుంది. నిర్మాతలు కూడా దీనిమీద అవహగానాతో సినిమాలు తీసి ఆర్థికంగా లాభపడాలని, అలాగే థియేటర్ లకు వెళ్లి హాయిగా సినిమా చూసే రోజులు కూడా త్వరలోనే రావాలని కోరుకుంటూ ఉన్నాను.

ఎందుకంటే సినిమాని అన్ని మాధ్యమాల్లో చూడాలి. మరిన్ని మంచి సినిమాలు రావాలి. నిర్మాత బాగుంటే సినిమా బ్రతుకుతుంది… నిలుస్తుంది. గెలుస్తుంది.

సంజీవ్ మేగోటి, దర్శకుడు, రచయిత

Related posts

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మంత్రి ఎర్రబెల్లి

Satyam NEWS

శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ బ్రాహ్మణ సత్రంలో వసంత పంచమి

Satyam NEWS

MGNREGS బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లించక పోతే హైకోర్టు ను ఆశ్రయిస్తాం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!