నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతి గురించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఓ కీలక ప్రకటన వెలువడింది. అమరావతి నిర్మాణానికి సంబంధించి వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆ రుణాల చెల్లింపును రాష్ట్ర ప్రజల నెత్తిన రుద్దుతారంటూ వస్తున్న ప్రచారంపై ప్రభుత్వం విస్పష్ట ప్రకటన చేసింది. అంతేకాకుండా అమరావతి నిర్మాణం కోసం తీసుకుంటున్న రుణాలను ఏ రీతిన చెల్లించనున్నారన్న విషయాన్ని కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు వివరించింది.
వెరసి… అమరావతి అప్పుల భారం తమపై పడదన్న భావనతో పాటు…అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఏమిటన్న దానిపై ప్రజలకు పూర్తిగా క్లారిటీ వచ్చిందనే చెప్పాలి. అంతేకాకుండా… అమరావతి నిర్మాణంపై విపక్ష వైసీపీ చేస్తున్న ప్రచారమంతా దుష్ప్రచారమన్న విషయం కూడా ప్రజలకు అర్థమైపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సోమవారం సీఆర్డీఏ సమావేశం జరిగిన తర్వాత పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ నిర్వహించిన మీడియా సమావేశంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.
సదరు మీడియా సమావేశంలో నారాయణ ఏమన్నారన్న విషయానికి వస్తే,.. అమరావతి అన్నది ప్రజా రాజధాని అని ఆయన తేల్చి చెప్పారు. ప్రజా రాజధాని నిర్మాణాన్ని అప్పులతోనే నిర్మిస్తున్నా… ఆ అప్పులను ప్రజలపై రుద్దుతారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అమరావతినిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు , ఇతరత్రా హామీలను అమలు చేసిన తర్వాత మిగిలిన భూములను అమ్మడం ద్వారా వచ్చే నిధులతో రుణాలను చెల్లిస్తామని ఆయన చెప్పారు. అంతేకాకుండా అమరావతి నిర్మాణం పూర్తి అయిన తర్వాత రాజధాని ప్రాంతం నుంచి వచ్చే ఆదాయంతో కూడా అప్పులను తీర్చుతామని ఆయన వెల్లడించారు.
ఇక అమరావతితో పాటుగారాష్ట్రంలోని 26 జిల్లాలను సమ ప్రాధాన్యం ఇస్తూనే… అన్ని జిల్లాలను… తద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానం గా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తమ ప్రభుత్వం పలు కీలక చర్యలను చేపట్టిన విషయాన్నికూడా ఆయన వివరించారు. రాష్ట్రానికి వస్తున్న టీసీఎస్, గూగుల్ లను విశాఖలో తమ కేంద్రాలను ఏర్పాటు చేసేలా ఒప్పించామన్నారు. ఇక కర్నూలు లాంటి ప్రాంతాల్లో డ్రోన్ హబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్రం ప్రకటించిన జాతీయ సంస్థలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలా కేటాయింపులు చేశామన్నారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నూతనంగా అందుబాటులోకి వస్తున్న ఓడరేవులు, భారీ పరిశ్రమలకు అనుబంధంగా శాటిలైట్ టౌన్ షిప్పులను నిర్మించనున్నట్లుగా నారాయణ తెలిపారు. ఈ టౌన్ షిప్పుల నిర్మాణం కోసం అవసరమయ్యే భూములను కూడా అమరావతి మాదిరిగానే రైతుల నుంచే సేకరిస్తామన్నారు. అంతేకాకుండా .. అమరావతిలో మాదిరిగానే ఆయా ప్రాంతాల్లోని టౌన్ షిప్పుల్లోనూ అక్కడి రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లను కేటాయిస్తామని చెప్పారు. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా అమరావతి తరహాలో నూతన టౌన్ షిప్పులు ఏర్పడతాయని, ఫలితంగా ఒకే ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందుతుందన్న భావనే రాదన్నారు.
అయినా రాజధాని కూడా లేకుండా నూతన ప్రస్థానం ప్రారంభించన రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తే… దాని నిర్మాణానికి సహకరించాల్సింది పోయి… విపక్ష వైసీపీ అమరావతిపై ప్రజలకు వ్యతిరేకత పెరగేలా వ్యవహరించడం సబబు కాదన్నారు. వైసీపీ ఎన్ని అవాస్తవాలను చెప్పినా.. నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్న వాస్తవాన్ని ఆ పార్టీ నేతలు గుర్తిస్తే మంచిదని నారాయణ సెటైర్లు సంధించారు.