22.2 C
Hyderabad
December 10, 2024 10: 32 AM
Slider ప్రత్యేకం

సునీల్‌  కళ్లు, చెవులకి తాళం.. తాడేపల్లి గుండె గుబేల్‌!

#vijaypoul

విజయ పాల్..  ఈ పేరు ఇప్పుడు ఏపీలో మారుమోగిపోతోంది. అయితే ఈయనేమీ ఎంపీనో, ఎమ్మెల్యేనో…లేదంటే మంత్రో కాదు. అలాగని విధి నిర్వహణలో ఉన్న అధికారి కూడా కాదు. పదవీ విరమణ పొందిన ఓ పోలీసు అధికారి. డ్యూటీలో ఉండగా.. విజయ పాల్ ఏ స్థాయిలో కేసులను పరిష్కరించారో తెలియదు గానీ… పదవీ విరమణ పొందాక… వైసీపీ జమానాలో చేతికందిన ఓఎస్డీ పోస్టులో మాత్రం ఈయన వ్యవహరించిన తీరే ఈయనను ఇప్పుడు జనానికి తెలిసేలా చేసింది.

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు గతంలో నరసాపురం ఎంపీగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. నాడు వైసీపీ టికెట్ పై ఎంపీగా గెలిచిన రఘురామ ఆ తర్వాత జగన్ తీసుకున్న నిర్ణయాలు నచ్చక వైసీపీకి దూరంగా జరిగారు. జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ సాగారు. ఈ క్రమంలో రఘురామను జగన్ సర్కారు తన బద్ధ శత్రువుగా పరిగణించగా.. ఆయనను అరెస్ట్ చేసి ఎంపీగా ఉన్న ఆయన హోదాను కూడా పక్కనపడేసి ఓ కరడుగట్టిన రౌడీని బాదినట్టుగా లాఠీలు, రబ్బరు బెల్టులతో ఆయనను తీవ్రంగా హింసించారు.

ఈ హింసకు కర్త జగన్ సర్కారు అయితే కర్మ, క్రియగా విజయ పాల్ వ్యవహరించారు. రఘురామను స్వయంగా విజయ పాల్ చిత్రహింసలకు గురి చేశారు. ఈ కేసులోనే విజయ పాల్ బుధవారం అరెస్ట్ అయ్యారు. ఈ సందర్భంగా విజయ పాల్ తీరు, రఘరామపై ఆయన చూపిన కఠినత్వం తదితరాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ జమానాలో చాలా కాలం పాటు సీఐడీకి సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ అధిపతిగా వ్యవహరించారు. వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న సునీల్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే అధికారిగా విజయ పాల్ గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈ కారణంగానే పదవీ విరమణ చేసిన విజయ పాల్ ను ఓఎస్డీగా తీసుకుని మరీ… ఆయనను సీఐడీలోనే కొనసాగించారు. ఈ క్రమంలో స్వామి భక్తిని ప్రదర్శించుకున్న విజయ పాల్… సునీల్ కు కళ్లు, చెవులుగా వ్యవరించారు. సునీల్ ఏది చెబితే అది చేస్తూ సాగిన విజయ పాల్ రఘురామను తమ కస్టడీలో రాత్రంతా చిత్రహింసలకు గురి చేశారు. సునీల్ తో పాటు నాటి వైసీపీ  సర్కారు పెద్దలు చెప్పిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ సాగిన విజయ పాల్ వైసీపీ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టేలా చేశారు.

వైసీపీ జామానాలో సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ ను కలవడం కాస్తంత ఈజీ ఏమో గానీ… విజయ పాల్ ను కలవడం అంటే మామూలు విషయం కాదు. చివరకు మీడియా ప్రతినిధులను కూడా చులకనగా చూసిన విజయ పాల్… వారిని బెదిరించే తరహాలో మాట్లాడేవారట. దీంతో చాలా మంది మీడియా ప్రతినిధులు విజయ పాల్ కార్యాలయంలో ఉన్నారంటే… అటుగా వెళ్లేందుకే సాహసించేవారే కాదట. కన్నూమిన్నూ కానకుండా చేసే దౌర్జన్యాలకు ఎప్పుడో అప్పుడు ఫుల్ స్టాప్ పడటం ఖాయమే కదా. అంతేకాకుండా ఆ దౌర్జన్యాలకు శిక్షలు కూడా తప్పవు కదా.

ఎంపీ హోదాలో ఉన్న ప్రజా ప్రతినిధిని రాత్రంతా చిత్రహింసలకు గుచి చేసిన విజయ పాల్… ఇప్పుడు అరెస్ట్ కావడం అందుకు ప్రబల నిదర్శనంగా చెప్పుకోవాలి. అయితే విజయపాల్ పై కేసు నమోదు అయితే అయ్యింది గానీ… ఆయనను విచారించే దమ్మూ. ధైర్యం సీఐడీలోని ఏ ఒక్క అధికారికి లేకుండా పోయింది. ఫలితంగా ప్రకాశం జిల్లా ఎస్పీగా వ్యవహరిస్తున్న ఐపీఎస్ స్థాయి అధికారి అయిన ఏఆర్ దామోదర్ ను కూటమి సర్కారు రంగంలోకి దింపాల్సి వచ్చింది. రఘురామ ఫిర్యాదు ఆధారంగా విజయ పాల్ పై కేసు నమోదు చేసిన సీఐడీ ఇన్ స్పెక్టర్ స్థాయి అధికారి… పాల్ కు విచారణకు పిలిచే సాహసం చేయలేకపోయారు.

దీంతో అదనపు ఎస్పీ హోదాలో సీఐడీలోనే పనిచేస్తున్న అధికారిని ఈ కేసు విచారణాధికారిగా నియమించినా… ఆయన కూడా పాల్ పేరు విన్నంతనే జడుసుకున్నారు. ఇలా పని కాదని భావించిన ప్రభుత్వం ఈ కేసు విచారణాధికారిగా ఏఆర్ దామోదర్ ను నియమించింది. దామోదర్ జారీ చేసిన నోటీసులతో పాల్ విచారణకు హాజరుకాక తప్పలేదు. తనను పెంచి పోషించిన వైసీపీ సర్కారు ఇప్పుడు అధికారంలో లేదని తెలిసినా… విజయ పాల్ లో ఆ మొండితనం ఇంకా తగ్గలేదన్న  వార్తలు వినిపిస్తున్నాయి.

రఘురామ కేసులో పాల్ ఇప్పటిదాకా 3 పర్యాయాలు విచారణకు హాజరు కాగా… విచారణ ఆద్యంతం డొంక తిరుగుడు సమాధానాలే ఇస్తూ సాగుతున్నారట. పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు తెలియదు, గుర్తు లేదు వంటి సమాధానాలతో విచారణాధికారులను ఆయన విసిగిస్తున్నారట. ఇక కొన్ని ప్రశ్నలకు సంబంధించి పక్కా ఆధారాలను ఆయన ముందు ఉంచిన సమయంలో మాత్రం పాల్ మౌనం వహిస్తున్నారట. దీంతో విచారణకు ఎంతమాత్రం సహకరించడం లేదన్న కారణంతో పాల్ ను సీఐడీ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే… అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పాల్ హైకోర్టును ఆశ్రయించగా…అక్కడ చుక్కెదురైంది. దీంతో వెనువెంటనే ఆయన సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖల చేశారట. ఈ కేసును వాదించేందుకు ఇద్దరు ఖరీదన న్యాయవాదులను కూడా రంగంలోకి దించారట. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తున్న వారు…తాము చెప్పినట్టుగా నడుచుకున్న పాల్ ను కాపాడేందుకు వైసీపీ నేతలు ఇప్పటికీ ఆయనకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారని చెప్పుకుంటున్నారు.

Related posts

మీరాలం చెరువుపై మరో కేబుల్ బ్రిడ్జి

Satyam NEWS

రాయచోటి లో టీడీపీ నేత పై వైసీపీ నేతల దాడి

Satyam NEWS

బ్రేవ్ లేడీ:మూడు బుల్లెట్ గాయలతో 7 కి.మీ. కార్లో

Satyam NEWS

Leave a Comment