27.7 C
Hyderabad
March 29, 2024 04: 14 AM
Slider ప్రత్యేకం

సమాజాన్ని తీర్చి దిద్దే వాడే నిజమైన గురువు

#TeachersDay

“మాతృదేవోభవ, పితృదేవోభవ,ఆచార్య దేవోభవ” అన్నది ఆర్యోక్తి. నవమాసాలు మోసి పెంచిన తల్లి, చెయ్యి పట్టి నడిపించిన తండ్రి తర్వాత, తత్ తుల్యులుగా భావించి, గుండెగుడిలో నిలుపుకొని పూజించవలసిన వ్యక్తులు గురువులు. గురు “దేవుడు”అన్నారు.

తల్లి, తండ్రి, గురువు ముగ్గురూ దైవంతో సమానం, వారిని గౌరవించాలి, పూజించాలి, వారి బోధనలు ఆలకించాలి, ఆచరించాలని  తరతరాలుగా పెద్దలు చెబుతున్న మాట. విద్యతో పాటు బుద్ధులు చెబుతూ, మార్గదర్శనం చేసినవాడే నిజమైన గురువు. అలా సమాజాన్ని తీర్చిదిద్దినవారందరూ గురుస్థానీయులు.

పల్లె నుండి ప్రపంచ స్థాయికి ఎదిగిన సర్వేపల్లి

పల్లె నుండి ప్రపంచస్థాయికి ఎదిగి, పేదరికం నుండి  ప్రాభవానికి ప్రగతి ప్రయాణం చేసిన  గురూత్తముడు ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణ. వారి జయంతిని “జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా” గురుపూజోత్సవంగా మనం జరుపుకుంటున్నాం.  కేవలం సభలు చేసి సంబరపడిపోతే సరిపోదు.

ఆచరణలో, వ్యవస్థలో గురుస్థానానికి గౌరవం దక్కినప్పుడు, దక్కించుకున్నప్పుడే ఈ ఉత్సవాల ప్రయోజనం.  విద్యాభ్యాసం గురుముఖతా జరిగిన కాలం నుండి ఆన్ లైన్ ముఖంగా సాగుతున్న కాలానికి వచ్చేశాం. గురుదేవుడిగా పూజించబడిన దశ నుండి,  కీచకగురువు అనిపించుకునే దశకు వచ్చాం.

విజ్ఞానంతో పాటు విలువలు పెరగాలి

అధ్యాపకుడు వేరు. గురువు వేరు. పాఠం చెప్పిన ప్రతి అధ్యాపకుడు గురువు కాదు. అధ్యాపకులందరూ కీచకులు కారు. ఎక్కడో, ఎవ్వరో కొందరి వల్ల వృత్తికి చెడ్డపేరు వస్తూ ఉంటుంది. కొందరు మహోన్నతులైన ఉపాధ్యాయుల వల్ల ఆ వృత్తికి అపారమైన గౌరవం పెరుగుతుంది.

పాఠ్యాంశాలతో పాటు, జీవిత పాఠాలు, విద్యాబుద్ధులు చెప్పిన మార్గదర్శకులందరూ గురుదేవులే. ఈ భరతభూమిపై ఎందరో ఉత్తమ అధ్యాపకులు, ఆచార్యులు, గురువులు సమాజాన్ని విజ్ఞానం వైపు, వికాసం వైపు నడిపించారు,  నడిపిస్తున్నారు.

అర్ధం మార్చుకుంటున్న గురు శిష్య బాంధవ్యం

విజ్ఞానంతో పాటు విలువలు పంచుతున్నారు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయుడు-విద్యార్థి బంధాలు మారుతున్నాయి. తగ్గుతున్నాయి. ఎంత పాశ్చాత్య పోకడ, ఎంత ఆధునిక నడవడిక వచ్చి చేరినా, గురువును గౌరవించే, పూజించే సంస్కృతి ఈ పుణ్యభూమిపై ఇంకా పచ్చగా ఉంది.

ఎందరో పెద్దలు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులను అలంకరించారు. ఎందరో మేధావులు, ప్రతిభామూర్తులు మన దేశంలోని విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులుగా (వైస్ ఛాన్సలర్లు) గా పనిచేశారు. వీరెవ్వరికీ దక్కని ప్రత్యేక గౌరవం సర్వేపల్లి రాధాకృష్ణకు దక్కింది.

ఆయన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా, గురుపూజోత్సవంగా ప్రభుత్వం నిర్ణయించిందంటే, మనం జరుపుకుంటున్నామంటే, అది సర్వేపల్లివారి సర్వోన్నత సంస్కారానికి, సమర్ధతకు ప్రేరణకు,నడవడికకు, మార్గదర్శనానికి  గొప్ప  ఉదాహరణగా చెప్పాలి.

అధ్యాపక వృత్తికి గౌరవం తెచ్చిన సర్వేపల్లి

విద్వాన్ సర్వత్ర పూజ్యయేత్, అనే నానుడికి నిలువెత్తు నిదర్శనం సర్వేపల్లి రాధాకృష్ణ. ప్రతి సెప్టెంబర్ 5వ తేదీ ఉపాధ్యాయులను, గురువులను తలచుకొని కొలుస్తున్నాం. దీనికి ప్రేరణగా, ఉపాధ్యాయ పదానికి పర్యాయపదంగా, అధ్యాపక వృత్తికి అమేయమైన గౌరవం నిలిపిన సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం, జీవనం కేవలం భారతదేశానికే కాదు, ప్రపంచ మానవాళికి మార్గదర్శనం చేసే వెలుగుదివ్వెలు.

ఆచార్యుడు, తత్త్వవేత్త, విజ్ఞానఖని, వివేకధుని సర్వేపల్లి. రెండు సార్లు ఉపరాష్ట్రపతి అయ్యారు. అత్యున్నతమైన రాష్ట్రపతి స్థానంలోనూ కూర్చొని, ఆ పదవికి, గురువు అనే పదానికి, భారతదేశానికి అనుపమానమైన  ఖ్యాతి తెచ్చిపెట్టిన సర్వేపల్లి రాధాకృష్ణ అక్షరాలా తెలుగువాడు.

తమిళనాడులోని తిరుత్తణి గ్రామానికి వలస వెళ్లిన తెలుగు దంపతుల గారాలపట్టి. తిరుత్తణి, తిరుపతి, నెల్లూరు, మద్రాస్ లో విద్యాభ్యాసం సాగించారు. బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలతో ఉత్తమ విద్యార్థిగా మన్ననలు పొందారు. అతిపిన్న వయస్సులో 21సంవత్సరాలకే మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ఉపన్యాసకుడి  పదవిని పొందారు.

తత్త్వశాస్త్రంలో సర్వేపల్లి ప్రతిభకు అచ్చెరువు చెందిన మైసూర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి హెచ్ వి నంజుండయ్య మైసూర్ విద్యాలయానికి ఆహ్వానించి ప్రొఫెసర్ గా నియమించి గౌరవించారు. సర్వేపల్లి ప్రతిభా ప్రయాణం అంతటితో ఆగలేదు. అప్రతిహతంగా సాగింది.

రవీంద్రనాథ్ ఠాగూర్, అశుతోష్ ముఖర్జీ వంటి మహామహులు సర్వేపల్లిని కలకత్తా విశ్వవిద్యాలయానికి ఆచార్యునిగా ఆహ్వానించారు.  ఆంధ్రవిశ్వవిద్యాలయానికి కట్టమంచి రామలింగారెడ్డి తర్వాత వైస్ ఛాన్సలర్ గా పదవిని చేపట్టి, విశ్వవిద్యాలయం ప్రతిష్ఠను జగద్విదితం చేశారు.

సుప్రసిధ్ధ ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయం ఆహ్వానం మేరకు గౌరవ ఆచార్యుడిగా అమెరికా, చైనా మొదలైన దేశాల్లో తత్త్వశాస్త్రంపై   అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చి, ఆ దేశ విద్యార్థులతో పాటు , ఆచార్యులను కూడా చైతన్య పరిచారు. సర్వేపల్లి కేవలం విజ్ఞానఖని కాదు, అద్భుతమైన ప్రసంగకర్త.

విద్యార్ధులతో స్నేహం చేయడమే ఆయన ప్రత్యేకత

తెలుగు, తమిళం, ఇంగ్లీష్ ఏ భాషలో మాట్లాడినా, ఆ ప్రసంగం పరమ ఆకర్షణీయం. ఏ విషయం స్పృశించినా స్ఫటిక సదృశమైన స్పష్టతతో ఆ ఉపన్యాసం సాగేది. విశ్వవిద్యాలయంలో పాఠం చెప్పిన సందర్భాల్లో 20నిముషాల సేపు మాత్రమే గంభీరంగా పాఠ్యాంశం చెప్పేవారు.

పీరియడ్ లోని మిగిలిన సమయంలో అనేక అంశాలు, విషయాలు విద్యార్థులకు స్నేహపూర్వకమైన వాతావరణంలో సలలితంగా చెప్పేవారు. దీని వల్ల విద్యార్థులకు పాఠ్యాంశంతో పాటు అనేక లౌకిక, అలౌకిక అంశాలు తెలిసేవి. వ్యక్తిత్వ సంపూర్ణ వికాసానికి సర్వేపల్లి ఉపన్యాసాలు మూల స్థంభాలై, పునాదులై నిలిచేవి.

మానవుని మెదడు 20నిముషాలకు  మించి సీరియస్ గా ఒక అంశాన్ని విని గ్రహించలేదనే మనస్తత్వశాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని, సర్వేపల్లి రాధాకృష్ణ పాఠాలు చెప్పేవారు. తత్త్వశాస్త్రంతో పాటు మనస్తత్వ శాస్త్రం ఎరిగి, విద్యా పరమైన మనోవిజ్ఞానశాస్త్రం (ఎడ్యుకేషనల్ సైకాలజీ) తెలిసి,  బోధనలో ఆచరించిన   సర్వోత్తమ ఆచార్యుడు సర్వేపల్లి.

భారతీయ తాత్త్విక చింతన ప్రపంచానికి చాటిన ఘనుడు

ప్రపంచ తత్త్వశాస్త్రాలన్నీ అద్భుతంగా అధ్యయనం చేయడమేకాక, భారతీయ తాత్త్విక చింతనను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనుడు. వివేకం, తర్కం ఇమిడి ఉన్న భారతీయ తాత్త్వికతను అర్ధం చేసుకోవడమంటే, సాంస్కృతిక చికిత్సను పొంది, దివ్య ఔషధాన్ని స్వీకరించి, శరీరాన్ని, మనసును తేజోమయం చేసుకోవడంగా భావించి, అనుభవించి, ఆ అనుభవ సారాన్ని ప్రపంచ మానవులకు పంచిన విశ్వ ఆచార్యుడు సర్వేపల్లి.

సర్వేపల్లి జీవితం నుండి ప్రతి ఒక్కరూ పాఠాలు నేర్చుకోవచ్చు. ఎంతో పేదరికం అనుభవించారు. అనాసక్తిగానే తత్త్వశాస్త్రం తీసుకున్నప్పటికీ, దాన్ని హృదయంలోకి మలచుకొని, తత్వశాస్త్రానికి మరోరూపంగా అవతరించిన సర్వేపల్లి మానసిక ప్రయాణం చాలా గొప్పది.

కాలమాన పరిస్థితులను  అర్ధం చేసుకొని, అన్వయం చేసుకొని, వ్యతిరేక పరిస్థితుల్లో కూడా స్వయం ప్రేరణ పొంది, అనుకూలమైన మానసిక వాతావరణాన్ని కల్పించుకుని, గెలుపు సాధించిన గొప్ప సాధకుడు సర్వేపల్లి. తండ్రికి చదివించే ఆర్ధిక స్థోమత లేకపోవడంతో, ఒక దశలో చదువు మాన్పించి పూజారిగా చేరిపొమ్మన్నారు.

వైభవం వైరాగ్యం సమదృష్టితో చూసిన మహోన్నతుడు

చదువంటే ఉండే అమిత ఇష్టంతో కష్టపడి చదివి, ఉపకారవేతనాలతోనే విద్యాభ్యాసం మొత్తం కొనసాగించిన గొప్ప ప్రేరణామూర్తి సర్వేపల్లి. అరిటాకు కూడా కొనలేని స్థితిలో నేలను శుభ్రం చేసుకొని, భోజనం చేసిన రోజులు కూడా రాధాకృష్ణ జీవితంలో ఉన్నాయి.

రాష్ట్రపతిగా వైభవమైన సౌధాల్లో జీవించే కాలం వచ్చినా, నేలను, గతాన్ని మర్చిపోలేదు. వైభవం, వైరాగ్యం సమానంగా తీసుకొని, వాటికి అతీతంగా మనసును ఉన్నత స్థితిలో నిలుపుకొని, నిరాడంబరమైన జీవితం గడిపిన నిజమైన తత్త్వవేత్త సర్వేపల్లి. విద్యార్థులకు విద్యాబుద్ధులతోపాటు ప్రేమను పంచిన అనురాగమూర్తి.

చైనా, పాకిస్తాన్ తో యుద్ధాలు జరుగుతూ భారతదేశం అత్యంత క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రులకు చక్కని మార్గాలు చూపించిన మార్గదర్శకుడు. నిరంతర జ్ఞానచింతనాపరుడు. గొప్ప చదువరి. సొగసరి కూడా. అధ్యాపకుడుగా విద్యార్థులను, ఉపకులపతిగా విశ్వ విద్యాలయాలను, రాష్ట్రపతిగా దేశ ప్రధానులను, విశ్వవిజ్ఞానఖనిగా తాత్త్విక విశ్వాన్ని మార్గదర్శనం చేసిన మహోన్నతమైన గురువు.

సాధారణ ఉపాధ్యాయుడి దశ నుండి రాష్ట్రపతిగా, విశ్వవిద్యా గురుపీఠాధిపతిగా విశిష్ట గురుస్థానాన్ని పొందిన సర్వేపల్లి రాధాకృష్ణను ఆదర్శంగా తీసుకొని, ప్రేరణగా నిలుపుకొని విద్యార్థులు, గురువులు, పాలకులు, బోధకులు  తమ యాత్రనుసాగిస్తూ,  తమ  పాత్రను పోషించడమే   సర్వేపల్లికి మనం సమర్పించే నిజమైన నివాళి.

గురువులను తలుచుకోవడం, కొలుచుకోవడం, విద్యావ్యవస్థకు గౌరవాన్ని కాపాడడమే ఈ ఉత్సవాన్ని  జరుపుకోవడంలో జరిగే ఒరిగే నిజమైన ప్రయోజనం. భారతీయఆత్మ  సర్వేపల్లి. ఈ మహనీయుని దివ్యస్మృతికి నీరాజనాలు పలుకుదాం

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

రావమ్మ ప్లవ రా

Satyam NEWS

మమ్ములను విమర్శించిన వారికి ఇదే సమాధానం

Satyam NEWS

రాజధాని రైతులకు 51 క్వింటాళ్ల బియ్యం విరాళం

Satyam NEWS

Leave a Comment