28.2 C
Hyderabad
January 21, 2022 16: 59 PM
Slider ఆధ్యాత్మికం

వైకుంఠ ఏకాదశి విశిష్టత

#vaikunthaekadasi

శ్రీ మహావిష్ణువుని ప్రత్యేకంగా కొలిచే పండుగ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి. వైకుంఠ ఏకాదశిని ఎప్పుడు చేస్తారూ అంటే చాలా మందికి తెలియని విషయం. సూర్య మానం ప్రకారం ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి పర్వదినంగా హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఎక్కువగా ఇది పుష్య శుద్ధ ఏకాదశి రోజున వస్తుంది.

వైకుంఠ ఏకాదశి రోజున అన్నీ వైష్ణవాలయాలలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో కూడి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఇస్తాడు. మూడు కోట్ల దేవతలతో కూడి దర్శనం ఇస్తాడు కాబట్టి వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానం. వైకుంఠ ఏకాదశిని త్రికోటి ఏకాదశి, పుత్ర ఏకాదశి అనికూడా పిలుస్తారు.

ముక్కోటి ఏకాదశి రోజునే క్షీర సాగర మధనంలో హాలాహలం పుట్టింది. సమస్త జీవకోటి హాలాహల ప్రభావంతో సతమతం అవుతుంటే, పరమ శివుడు విషాన్ని తన గొంతులో ధరించి జీవకోటికి ఉపశమనం కలిగిస్తాడు. తర్వాత అమృతం పుట్టింది.

విష్ణు పురాణంలో వైకుంఠ ఏకాదశి గురించి ఒక కథ ఉంది. పూర్వం ముర అనే రాక్షసుడు ప్రజలను, ఋషులను, దేవతలను హింసిస్తుండేవాడు. ముర పెట్టే బాధలకు తాళలేక, రాక్షసుని బారి నుంచి రక్షించమని దేవతలు విష్ణువును శరణు వేడుకొంటారు. మురను సంహరించాలంటే ప్రత్యేక మైన అస్త్రం కావాలని, అందుకు కొంతకాలం వేచియుండమని చెప్పి దేవతలను పంపి, బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించి విశ్రమిస్తాడు. గుహలో విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువును సంహరించడానికి వచ్చిన మురను, విష్ణువు నుండి ఉద్భవించిన శక్తి సంహరిస్తుంది. అలా ఉద్భవించిన శక్తీకి శ్రీ మహావిష్ణువు ఏకాదశి అని నామకరణం చేస్తాడు. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును అర్చించి, ఉపవాసం, జాగారం, దాన ధర్మాలు చేసినట్లయితే వారి పాపములను హరిస్తానని ఏకాదశికి వరమిస్తాడు.

అన్నీ ఏకాదశి పర్వదినాలు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పర్వదినాలు. ముక్కోటి ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలి అనే ప్రశ్న ఉదయించక మానదు. ఏకాదశి ముందు రోజు రాత్రి అంటే ద్వాదశి నాడు రాత్రి బియ్యంతో చేసిన అన్నం/ఆహారం కాకుండా అల్పాహారం తీసుకోవాలి.

ఏకాదశి రోజున తెల్లవారు జామున వీలయినంత త్వరగా నిద్ర లేచి శిర స్నానం చేయాలి. అవకాశం ఉన్న వాళ్ళు సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేయటం మంచిది. ఉదయాన్నే శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. శ్రీ మహావిష్ణువతో పాటుగా మూడు కోట్ల దేవతలు కూడా కొలువై ఉంటారు. ఉత్తర ద్వార దర్శనం వల్ల తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలు పోతాయి.

మరుసటి రోజు ఉదయం వరకు ఉపవాసం ఉండాలి. ఉపవాసమంటే పూర్తిగా ఆహారం లేకుండా ఉండటం కాదు. బియ్యంతో వండిన ఆహారం కాకుండా, పాలు, పళ్ళూ లాంటి వాటిని మితంగా తీసుకోవాలి. వైకుంఠ ఏకాదశి రోజున ముర రాక్షసుడు బియ్యంలో దాగి ఉంటాడు కనుక బియ్యంతో వండిన ఆహార పదార్థములు భుజించరాదని చెపుతారు. ఏకాదశి రోజున పగలు మరియు రాత్రి నిద్ర పోకుండా జాగారం ఉండాలి. జాగారం అంటే వినోద కార్యక్రమాలతో మేలుకొని ఉండటం కాదు, మేలుకొని దైవ ధ్యానంలో గడపాలి.

తెల్లవారిన తరువాత శుచిగా స్నానమాచరించి, పూజా మందిరం శుభ్రం చేసి విష్ణువును పూజించాలి. తరువాత శక్తి కొలది దానం చేయాలి. తరువాత ఉపవాస దీక్ష విరమించి భోజనం చేయవచ్చు. ద్వాదశి రోజున పగలు నిద్ర పోరాదు. రాత్రి అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి సర్వ పాపములు నశించి, యమ భయం ఉండదు. వైకుంఠ ఏకాదశినాడు మరణించిన వారు నేరుగా వైకుంఠం చేరుతారని పురాణాలు చెబుతున్నాయి.

తమిళనాడులోని శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు వైభవంగా జరుగుతాయి. విష్ణువు అవతారమైన రంగనాథస్వామిని వైకుంఠ ఏకాదశి రోజున వజ్రాలతో చేసిన వస్త్రాల్ని అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకొని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల నమ్మకం.

మన రాష్ట్రంలో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా వైకుంఠద్వారా ప్రవేశం, తదనంతరం దైవదర్శనం అనుమతిస్తారు. ఈ ఏకాదశికి ముందురోజు అనగా దశమినాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిలి మూసివేస్తారు. పిదప తెల్లవారు జామున వైకుంఠ ఏకాదశినాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశినాటి రాత్రి ఏకాంతసేవ వరకూ శ్రీవారి గర్భాలయానికి ఆనుకొనియున్న వైకుంఠద్వారాన్ని తెరచి వుంచుతారు. ఈ రెండు రోజులూ భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు.

ఓమ్  నమోనారాయణాయ నమో వెంకటేశయా

Related posts

రాజంపేటలో బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో నిరసన…

Satyam NEWS

అన‌గ‌న‌గా ఓ అతిధి చిత్ర ప్రెస్ మీట్..

Sub Editor

ఫోటో కోసం వెళ్ళిన మైనర్ బాలికపై అఘాయిత్యం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!