వక్ఫ్ సవరణ బిల్లు లోక్ సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందుతున్న సమయంలో మజ్లీస్ ఎంపి ఒవైసీ ఎంతో బాధపడుతున్నట్లు, ఆయన దాదాపుగా ఏడుస్తున్నట్లు ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆ వీడియో క్లిప్ ను చూపిస్తూ ఒవైసీ భావోద్వేగానికి గురైనట్లు మజ్లీస్ పార్టీ అనుకూల వర్గాలు ప్రచారం చేశాయి. వక్ఫ్ బిల్లును ఆపలేక ఆయన బాధపడుతున్నట్లుగా వారు చూపించారు. దీనికి కౌంటర్ గా ఒవైసీ నిస్సహాయంగా ఏడుస్తున్నాడు… అంటూ హిందూ వర్గాలు అదే వీడియోను ప్రచారం చేశాయి.
కట్ చేస్తే… ఒవైసీ ఏడుస్తున్నట్లు ఉన్న వీడియో గత సంవత్సరంది. పాత వీడియోను ప్రచారం చేసి సానుభూతి కోసం ప్రయత్నించినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది.
రాజ్యసభలో తీవ్ర ఆరోపణలు, వాదోపవాదాలు చేసుకొన్న వివిధ పార్టీల సభ్యులు విరామ సమయంలో బల్లలు చరుస్తూ నవ్వుకుంటున్న వీడియో మరొకటి కూడా సంచలనం కలిగిస్తున్నది. ప్రజల కోసం పనిచేసే ప్రజాప్రతినిధులు ఇలా కలిసిమెలిసి, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండటం చూడటానికి సంతోషంగానే ఉంటుంది. అయితే, జాయింట్ పార్లమెంట్ కమిటీ (జేపీసీ)లో తెలంగాణ బీజేపీకి చెందిన డీకే అరుణ, ఎంఐఎంకు చెందిన అసదుద్దీన్ ఒవైసీ ఇద్దరూ సభ్యులుగా ఉన్నారు. వారు కూడా ఈ వీడియోలో ఉన్నారు. వారు కూడా ఇక్కడ హాయిగా నవ్వుకుంటూ కనిపించారు. ఒవైసీ వక్ఫ్ బిల్లు ఆమోదం పొందుతున్న సమయంలో తీవ్రంగా బాధపడ్డారని ఆ వీడియోలో కనిపిస్తున్నది.
డి కె అరుణ బీజేపీకి చెందిన లోక్ సభ సభ్యురాలు. ఆమెతో పాటు కూర్చుని ఒవైసీ నవ్వుతూ మాట్లాడటం కూడా ఈ తాజా వీడియోలో కనిపిస్తున్నది. లోక్ సభ, రాజ్య సభల్లో వక్ఫ్ బిల్లు ఆమోదించిన తర్వాత ఒవైసీ మాటలు కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. చర్చలో పాల్గొన్ని బిల్లును వ్యతిరేకిస్తున్నామని చెప్పి చివరికి బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిన వారి గురించి ఒవైసీ పల్లెత్తు మాట మాట్లాడలేదు. అయితే, ఆయన కేవలం మద్దతు ఇస్తున్నామని ముందే బహిరంగంగా చెప్పి అనుకూలంగా ఓటు వేసిన వారిని మాత్రమే విమర్శించారు.
జేపీసీ సభ్యులుగా వీరిద్దరూ 14 జేపీసీ సమావేశాలకు హాజరయ్యారు. టీడీపీ నుండి జేపీసీకి ఎంపికైన నరసరావుపేట ఎంపి లావు కృష్ణ దేవరాయలు 11 సమావేశాలకు హాజరయ్యారు. కానీ, వైసీపీ నుండి ఎంపికైన విజయసాయిరెడ్డి కేవలం నాలుగు జేపీసీ సమావేశాలకే హాజరయ్యారు. జెపీసీ సమావేశాలలోనూ అంతకు ముందు, పార్లమెంటు లో జరిగిన చర్చ సమయంలోనూ తెలుగుదేశం పార్టీ వక్ఫ్ బిల్లుకు సవరణలు ప్రతిపాదించింది. వాటిని జెపిసి ఆమోదించింది. లోక్ సభ, రాజ్యసభ ల్లో జరిగిన చర్చల్లో కూడా తెలుగుదేశం పార్టీ ముస్లింలకు అనుకూలంగానే మాట్లాడింది.
తెలుగుదేశం చేసిన ప్రతిపాదనలతో జేపీసీ ఆమోదించిన అనేక సవరణలు బిల్లులో మార్పులు చేశారు. రాజ్యసభలో చర్చలు, వాదనల సమయంలో ప్రతిపాదించిన సవరణలకు తగినంత మద్దతు లభించలేదు. జేపీసీలో సహేతుకమైన కారణాలు చూపించి, మెజారిటీ సభ్యులు అంగీకరించిన సవరణలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ముస్లిం నాయకులను, మత పెద్దలను కలిసి కొన్ని ముఖ్యమైన సవరణలను జేపీసీ ద్వారా ఒప్పించగలిగింది.
ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ వక్ఫ్ బిల్లు రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా అమల్లోకి వస్తుంది. టీడీపీ అడ్డుకున్నా, అనుకూలంగా వచ్చిన ఓట్ల సంఖ్య చూస్తే బిల్లు ఆగే అవకాశం లేదు. కానీ, టీడీపీ కొన్ని సవరణలు చేయించి కొంత మేలు చేసింది. దొంగాట ఆడిన వైసీపీ విషయంలో ఒవైసీ మౌనం, ఆయనకు ముస్లింల పట్ల ఉన్న నిబద్ధత కంటే ఏదో పాత పగకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన కలిగిస్తోంది. కనీసం జగన్ పాలనలో ముస్లింల పట్ల జరిగిన అమానుషాలను కూడా ఖండించని ఒవైసీ కరడుగట్టిన పగ నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ఇక ముస్లిమేతరులలో ఒకరిని వక్ఫ్ పరిపాలన పనులకు అనుమతించడం కొంతమంది ముస్లింలను కలవరానికి గురిచేసింది.
ఈ బిల్లు ద్వారా హిందువుల మద్దతు పొందాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఆ ఒక్క సెంటిమెంటల్ అంశమైన సవరణకు ఒప్పుకోలేదేమో. ఆ ఒక్క విషయంలో చంద్రబాబు మాట నెగ్గలేదని ఒవైసీ తీవ్రంగా స్పందించడం, మిగిలిన సవరణల విషయంలో చంద్రబాబు విజయాన్ని గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సుప్రీంకోర్టుకు వెళ్లి ఈ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేయిస్తామని కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే.