మనందరిలోనూ పవిత్రమయిన హృదయం ఉంది. కాని చీకటి అనే అజ్ఞానంతో మనసంతా చెడు ఆలోచనలతోనూ, దుర్గుణాలతోను నిండిపోవడం వల్ల దానిని గుర్తించలేక పోతున్నాము. మన అజ్ఞానం ఎంతంటే- దీపం వెలిగించ మన్నప్పుడు నీటికీ , నూనెకు తేడా తెలియనటువంటి చీకటి స్థితిలో ఉన్నాము. మరి ఈ చీకటి స్థితి నుంచి బయటపడి జ్ఞానదీపాన్ని వెలించు కోవాలంటే మంచి సద్గురువు చాలా అవసరం.
గురువు అంటే బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు ఒకటై జన్మించిన రూపం అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే గురువు. గు అంటే అంధకారము లేదా అజ్ఞానాన్ని, రు అంటే నిరోధించుట లేక నశింప చేయుట అని! గురువు అంటే అజ్ఞానాన్ని నశింప చేయువారు అని అర్ధము. ‘శబ్దమంధకారస్యరుతన్నిరోధకః’ అని పెద్దల వచనం గురువు చేయవలసినది తన శిష్యులను అంధకారంలోంచి వెలుగులోకి తీసుకు రావడం. ఈ భౌతిక జగత్తులో ఏ మానవుడూ సంసారయాతనలు అనుభవించకుండా చూడటం ఆ గురువు కర్తవ్యం.
ఆ గురువు సాన్నిధ్యంలో కామ,క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్యాలు అనే దుర్గుణాలను , అహంకారాన్ని విడిచిపెట్టి ధ్యాన సాధన చేస్తే హృదయం పవిత్రమవుతుంది. అప్పుడు ఆ పవిత్ర మైన హృదయంలో జ్ఞానమనే దీపం వెలిగించుకోవడం సాధ్యమవుతుంది.
విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి. ఒకప్పుడు గురుకులాలుండేవి. వాటిలో చేరిన విద్యార్థులకు తల్లీ తండ్రీ అన్నీ తామే అయ్యేవారు గురువులు. మాతృదేవోభవ , పితృదేవోభవ , ఆచార్యదేవోభవ అంటారు. తల్లీ తండ్రీ తరువాత స్థానం గురువుదే.
“గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః” దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు. అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవరూ రక్షించలేరట. అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు , జ్ఞనాన్ని అందించే గురువుకు సేవచేసి , గురుకృప పొంది మహనీయులైనవారు ఎందరో వున్నారు.
“గురువునూ, గోవిందుడిని పక్కనపెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే , గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా”* అంటాడు భక్త కబీర్ దాస్. అదీ మన భరతీయసంస్కృతి ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురుపౌర్ణమినాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి.
గురు పూర్ణిమ విశిష్టత:
వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ !
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ !!
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే !
నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః !!
ప్రతి సంవత్సరం ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున ‘వ్యాస మహర్షి’ జన్మ తిథి అయిన గురు పూర్ణిమ గా మనం జరుపుకుంటాం. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.
గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాసమహాముని పుట్టిన రోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది.
గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు.
సనాతన ధర్మంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుని మానవజాతి కంతటికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయనను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం- కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.
లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మ తిథిఅయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను ‘గురు పూర్ణిమ’గా జరుపుకోవడం ఆచారమైంది. అంతే గానీ ఈమధ్య పుట్టిన బాబాల పుట్టినరోజు కాదు!