చదువుతో పాటు క్రీడలకు అంతే ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డి అన్నారు. డిసెంబర్ 17 నుండి 19 వరకు నిర్వహించిన ముఖ్యమంత్రి కప్ క్రీడల ముగింపు కార్యక్రమం వనపర్తిలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించగా జిల్లా కలక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలకు అంతే ప్రాధాన్యత ఇవ్వాలని అప్పుడే జీవితంలో రాణిస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా ఫుట్ బాల్ క్రీడాకారుడని, వనపర్తిలోనే విద్యాభ్యాసాలు పూర్తి చేసి ఇక్కడే ఇదే మైదానంలో ఆటలు ఆడుకున్నారని గుర్తు చేశారు.
ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటూ హైదారాబాద్ లోని హెచ్.ఆర్.డి. క్యాంపస్ లో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకుని పక్కనే ఫుట్బాల్ మైదానం ఏర్పాటు చేయించి ప్రతి రోజూ గంట సేపు ఫుట్బాల్ ఆడుతారని చెప్పారు. రాష్ట్ర స్పోర్ట్స్ అధారిటీ చైర్మన్ శివసేన రెడ్డి సైతం వనపర్తి జిల్లా వాసి అని చెప్పారు. క్రీడలు నిర్వహిస్తున్న క్రీడా ప్రాంగణం ఒకప్పుడు చవుడు భూమిగా ఉండేదని క్రీడా మైదానం తీర్చిదిద్దడంలో తనవంతు పాత్ర సైతం ఉందని తెలిపారు. జిల్లాలో విద్యా వికాసానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కప్ కు నెల రోజుల నుంచి సన్నాహకాలు చేసి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నేడు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. మొత్తం 36 క్రీడా విభాగాల్లో క్రీడలు నిర్వహించగా 3600 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. అనంతరం క్రీడల్లో మొదటి, రెండవ, తృతీయ స్థానంలో గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్, కప్ లు బహుకరించారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్