తెలంగాణ

ఆంధ్రప్రభకు లీగల్ నోటీసులు

ad-obligation-srichaitanya_4850

చట్ట విరుద్ధంగా 40 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ కు పాల్పడిన ఆంధ్రప్రభ ప్రతినిధులకు తెలంగాణ శ్రీ చైతన్య విద్యాసంస్థ లీగల్ నోటీసు జారీ చేసింది. 40 లక్షల రూపాయలు డిమాండ్ చేసి తాము ఇవ్వనందుకు కక్షగట్టి తమ పరువును తీసే విధంగా సుమారుగా 10 వార్తలు అదే పనిగా రాశారని వారు తమ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. తెలంగాణ శ్రీ చైతన్య విద్యాసంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మల్లెంపాటి శ్రీధర్ పేరుతో ఆంధ్రప్రభ చైర్మన్ ముత్తా గోపాలకృష్ణ, మేనేజింగ్ డైరక్టర్ ముత్తా గౌతమ్, చీఫ్ ఎడిటర్ వై ఎస్ శర్మ, జనరల్ మేనేజర్ పి.భాస్కర్, ఖమ్మం జిల్లా ఎడిషన్ బ్యూరో ఇన్ చార్జి సామినేని కృష్ణమురారి, ఖమ్మం సిటీ బ్యూరో ఇన్ చార్జి ఎం.పాపారావు, ఖమ్మం ఆంధ్రప్రభ ఎడ్యుకేషన్ రిపోర్టర్ దేవేందర్, కొత్తగూడెం స్టాఫ్ రిపోర్టర్ కనుకు వెంకటేశ్వర్లు పేర్లను పేర్కొంటూ ఈ లీగల్ నోటీసు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 50కు పైగా స్కూళ్లు, ఖమ్మం పట్టణంలో 7 జూనియర్ కాలేజీలు నడుపుతూ అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలుగా ఉన్న తమ పరువు తీసేందుకు ఈ బ్లాక్ మెయిలింగ్ వార్తలు రాశారని వారు తమ నోటీసులో పేర్కొన్నారు. 3,500 మంది సిబ్బంది పని చేస్తుండగా వేలాది మంది విద్యార్ధులు చదువుతున్న తమ సంస్థలపై తప్పుడు వార్తలు రాసి బ్లాక్ మెయిల్ చేయాలని చూశారని, 40 లక్షల రూపాయలు డిమాండ్ చేసి అవి ఇవ్వకపోవడంతో తమ ప్రతిష్టకు భంగం కలిగించే నిరాధారమైన వార్తలు రాశారని వారు పేర్కొన్నారు. ఎంసెట్ లాంటి ఎంట్రెన్సు పరీక్షల్లో జెఇఇ అడ్వాన్స్ డ్, నీట్ మెడికల్, సిఏ-సిపిటి లాంటి ప్రతిష్టాత్మక కోర్సుల్లో తమ సంస్థల నుంచి వెళ్లే వందలాది మంది విద్యార్ధులు ప్రతి ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తుంటే వాస్తవాలు వక్రీకరించి అదే పనిగా నిరాధారమైన వార్తలు రాసి తమను మానసిక క్షోభకు గురి చేశారని వారు తెలిపారు. తమనే కాకుండా తమ వద్ద చదివే విద్యార్ధులను, వారి తల్లిదండ్రులను కూడా ఆంధ్రప్రభ వార్తలు మానసిక వేదనకు గురి చేశాయని వారు తెలిపారు. వార్తలు రాసి తెలంగాణ లోని తమ క్యాంపస్ లన్నింటిలో ఆంధ్రప్రభ ఉచితంగా పంచి పెట్టి విద్యార్ధుల్లో వారి తల్లిదండ్రుల్లో అనుమాన బీజాలు నాటేందుకు  ప్రయత్నం చేశారని తెలంగాణ శ్రీ చైతన్య విద్యాసంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మల్లెంపాటి శ్రీధర్ తాను ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. తామిచ్చే కోచింగ్ తో తమ విద్యార్ధులు నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్పులు కూడా పొందుతున్నారని అలాంటిది అభూత కల్పనలతో ఆంధ్రప్రభలో వార్తలు రాశారని వారు నోటీసులో పేర్కొన్నారు. 40 లక్షల రూపాయలు డిమాండ్ చేసి తమ విద్యా సంస్థల లో సరఫరా చేసేందుకు పత్రికలకు చందాలు కట్టాలని తమను బలవంతం చేశారని తాము 40 లక్షల రూపాయలు ఇవ్వకపోవడంతో పలు రకాల అభూత కల్పనలతో వార్తలు రాసి పత్రికలు పంచిపెట్టి తమ పరువుకు భంగం కలిగించారని వారు పేర్కొన్నారు. చట్ట ప్రకారం నడుస్తున్న తమ సంస్థలు అక్రమ సంస్థలుగా, అనుమతులు లేని విద్యాసంస్థలుగా పేర్కొనడం కేవలం తమ ప్రతిష్టకు భంగం కలిగించడానికేనని అందులో ఎలాంటి వాస్తవం లేదని వారు తెలిపారు. ఐపిసి 499 సెక్షన్ కింద ఆంధ్రప్రభకు నోటీసులు ఇచ్చారు.  

Related posts

లాక్ డౌన్ వల్లనే కరోనా వ్యాప్తి నిలిచిపోయింది

Satyam NEWS

కారు, బస్సు మధ్య నలిగిపోతున్న కమలనాథులు

Satyam NEWS

సిటిజన్ చార్టర్: అవినీతికి పాల్పడితే ఇక ఇంటికే

Satyam NEWS

Leave a Comment