శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు తనకెంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై భక్తకోటికి దర్శనమిచ్చాడు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు వెళుతుండగా భక్తుల కోలాటాలు, డ్రమ్స్ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ కోలాహలంగా సాగింది. అన్ని గ్యాలరీల వద్ద స్వామివారిని అటు ఇటు తిప్పుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు. కాగా, బ్రహ్మోత్సవాలలో ఆరో రోజైన శనివారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు హనుమంత వాహనం, సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు స్వర్ణరథం, రాత్రి 8 నుండి 10 గంటల వరకు గజవాహనంపై శ్రీవారు ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.
previous post
next post