కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం ఉదయం వేణుగానాలంకారంలో స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ నటేష్ బాబు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.