స్టయిలిష్ స్టార్ అల్లూ అర్జున్ కు ఈ ఏడాది వాహన యోగం దివ్యంగా వెలుగుతున్నట్టే కనిపిస్తోంది. బన్నీఖాతాలో ఇటీవలే 8కోట్ల ఖరీదైన వ్యానిటీవ్యాన్ `ఫాల్కన్` చేరింది. ఆ వాహనం ఫోటోలు అభిమానుల సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆన్ లొకేషన్ బన్నీకి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని అవసరాలు తీర్చే భారీ హంసతూలికా తల్పం ఇది. ఒక రకంగా ఇది ఆన్ లొకేషన్ సకల సౌకర్యాల విల్లా అని చెప్పొచ్చు. అతడి ఫ్యాషన్ కి తగ్గట్టే తాజాగా ఇంటి గ్యారేజ్ లోకి సరికొత్త రేంజ్ రోవర్ వచ్చి చేరింది. భారీతనం అధునతన సాంకేతికత ఈ కార్ ప్రత్యేకత. దీనికి బన్ని ముద్దుగా BEAST (బీస్ట్) అని నామకరణం చేశారు. ఇన్ స్టాగ్రమ్ లో ఈ ఫోటోని షేర్ చేసిన బన్ని ఆసక్తికర వ్యాఖ్యానాన్ని జోడించారు. “ఇంట్లో కొత్త కార్ వచ్చి చేరింది. దీనికి బీస్ట్ అనే పేరు పెట్టాను. ప్రతిసారీ సంథింగ్ ఉంటేనే కొంటాను. నా బుర్రలో ఇలాంటి సమయంలో ఓ విషయం ఉంటుంది… దాని పేరే గ్రాటిట్యూడ్(కృతజ్ఞతాభావం). రేంజ్ రోవర్ #ఏఏ-బీస్ట్“ అంటూ ఎమోషనల్ అయ్యారు బన్ని. ఆసక్తికరంగా అల్లు అర్జున్ (Allu Arjun) ఖాతాలోకి చేరిన ప్రతి వస్తువుకు AA బ్రాండ్ గా పాపులారిటీ దక్కుతోంది. AA ఫాల్కన్.. AA బీస్ట్.. అంటూ వాహనాల పేర్లు ఆకట్టుకున్నాయి. ఇప్పడు అమీర్ పేట సత్యం థియేటర్(హైదరాబాద్) స్థానంలో ఏషియన్ సినిమాస్‌తో కలిసి బన్ని నిర్మిస్తున్న భారీ మల్టీప్లెక్స్ థియేటర్లకు AAA సినిమాస్ (ఏషియన్ అల్లు అరవింద్ సినిమాస్) అంటూ నామకరణం చేయడం విశేషం.
previous post
next post