టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సర పరిపాలన చూసుకుంటే ఆందోళనకర పరిస్థితి కనిపిస్తున్నదని కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. గత బడ్జెట్ సమావేశాలలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీస్తుందని చెప్పామని అయితే ఆనాడు తమను హేళన చేసి మాట్లాడారని ఇప్పుడు అదే నిజమైందని ఆయన అన్నారు.
రైతు బంధు ద్వారా సమయానికి రైతులకు చెల్లింపులు చేస్తామన్నారు కానీ ఇవ్వలేదని, నిరుద్యోగ భృతి హామీని మరచిపోయారని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తాను అని ప్రకటించి మాట తప్పారని భట్టివిక్రమార్క అన్నారు. సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకుంటే అకౌంట్లో డబ్బులు వేస్తానని చెప్పి ప్రజల్ని మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. పెన్షన్ లు ఇవ్వడం తప్ప రాష్ట్ర ప్రజలకి మీరు ఏమైనా చేసారా అంటే ఏమి లేదనే సమాధానమే వస్తున్నదని భట్టివిక్రమార్క అన్నారు.
గత ప్రభుత్వాలు మొదలు పెట్టిన సాగు నీటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేదు సరికదా వాటిని చంపేశారని, మొదలు పెట్టిన ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదని ఆయన అన్నారు. మళ్ళీ కొత్తవి కడతాము అంటున్నారు ఇది ఎలా సాధ్యమని భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
మీకు డబ్బులు అవసరం అనుకుంటే కొత్త బ్యారేజీ ప్రకటించడం అందులో మీరు కాంట్రాక్టర్ లు డబ్బులు దోచుకోవడం పరిపాటి గా మారింది అని ఆయన సిఎం కేసీఆర్ ను నిశితంగా విమర్శించారు.