రాష్ట్రంలో బ్యాంకులు రైతులకు ఇస్తున్న రుణాల సంఖ్య ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైయస్సార్ నవోదయం పధకం కింద ఎంఎస్‌ఎంఈలకు, ప్రధానమంత్రి ముద్ర యోజన కింద ఇచ్చే రుణాలు, ఎస్సీ,ఎస్టీ, మహిళలకిచ్చే రుణాల శాతం చాలా తక్కువగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
నేడు రాష్ట్ర బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వయం సహాయక సంఘాల రుణాలపై కూడా బ్యాంకులు దృష్టి పెట్టాలని ఆయన కోరారు. మహిళలకు వడ్డీ రేట్ల విషయంలో బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఆయన అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కేటగిరీ ఒకటిలో ఉన్న 6 జిల్లాల్లో ఒకలా, మిగిలిన 7 జిల్లాలో ఇంకోలా వడ్డీరేట్లు ఉన్నాయని, బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీరేట్లు చాలా ఎక్కువగా ఉంటున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వం తరఫున సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో బ్యాంకులు ఈ స్థాయిలో వడ్డీలు వేయడం ఆలోచించదగ్గ విషయమని అన్నారు.
210వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో నిర్దేశించుకున్న రుణాలు, ప్రగతిని ఆంధ్రాబ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ జె.పకీరసామి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఎస్.ఎస్.రావత్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, కె పకీరిసామి, ప్రెసిడెంట్ (ఎస్‌ఎల్‌బీసీ), కే వి నాంచారయ్య, కన్వీనర్, ఎస్‌ఎల్‌బీసీ, సీజీఎం(ఆంధ్రా బ్యాంకు), ఆర్బీఐ జనరల్‌మేనేజర్ సుందరం శంకర్, నాబార్డ్ సీజీఎం ఎస్.సెల్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.