తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్ ను ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతకం చేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ప్రణాళికా సంఘం అత్యంత కీలకమైనది కావడంతో అనుభవజ్ఞుడైన వినోద్ కుమార్ ను ఈ సంఘానికి ఉపాధ్యాక్షుడిగా సిఎం నిర్ణయించారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి త్వరలోనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అన్ని శాఖలకు సంబంధించిన వ్యవహారాలను సమీక్షించి, ప్రతిపాదనలు తయారు చేసే కీలక పనిని కూడా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడికి ఉంటుంది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి కేబినెట్ హోదా కలిగి వుండడంతో పాటు కేబినెట్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడిగా ఉంటారు. వినోద్ కుమార్ ఈ పదవిలో మూడేళ్లు కొనసాగుతారు. రాజకీయాల్లో, పరిపాలనా అంశాల్లో ఉన్న అనుభవంతో పాటు తెలంగాణ భౌగోళిక, సామాజిక, ఆర్థిక అంశాల పట్ల అవగాహన కలిగిన వినోద్ కుమార్ సేవలు సంపూర్ణంగా వినియోగించుకోవాలనే ఈ నియామకం చేసినట్లు సిఎం కేసీ ఆర్ చెప్పారు.
previous post
next post