ఎన్టీఆర్ జిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గలో ప్రతిపక్ష హోదాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 2022 నవంబర్ 4 వ తేదీన నిర్వహించిన సభపై జరిగిన రాళ్ళ దాడి సంఘటన ఆషామాషీ వ్యవహారం కాదని, చంద్రబాబుపై ఉద్దేశ పూర్వక హత్యకు ప్రణాళిక అని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న నాయకునిపై రాళ్ళు వేయటం అంటే, తెలిసి నేరానికి పాల్పడటమే అన్నారు. ఈ సంఘటనలో సిఎస్ఒ మధు అనే అధికారి గాయపడ్డారని చెప్పారు.
అప్పట్లో ఈ సంఘటనను విజయవాడ సిపీ క్రాంతి రాణా నీరుగార్చరని, పట్టించుకోలేద తెలిపారు. ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ల పాత్ర ఉన్నట్టుగా, తాలిబాన్ల మాదిరిగా మూడు బృందాలుగా ఏర్పడి దాడి వ్యూహాన్ని అమలు చేశారని చెప్పారు. రాయి చంద్రబాబుకు తగిలి ఉంటే, పరిస్థితి ఊహకు అందని భయానకంగా ఉండేదని చెప్పారు. ఆ రోజు చంద్రబాబు సభకు తాను కూడా వెళ్ళానని, గంటసేపు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిని, ఆందోళనను చూశాను అన్నారు. ఇలాంటి నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయ స్థానాలు కూడా ప్రత్యేకంగా విచారించి కఠినంగా స్పందించాల్సిన అవసరం ఉందని బాలకోటయ్య అభిప్రాయపడ్డారు.