28.2 C
Hyderabad
April 30, 2025 05: 45 AM
Slider ముఖ్యంశాలు

భూమికి క్షేమంగా చేరిన సునీతా విలియమ్స్

#sunitha

వారం రోజుల పరిశోధనల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి అనూహ్యంగా అక్కడ చిక్కుకున్న భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్,ఆమె సహచరుడు బుచ్ విల్‌మోర్‌లు 9 నెలల అనంతరం తిరిగి భూమిపైకి చేరుకున్నారు. ఈ ఇద్దరు వ్యోమగాములను భూమికి తీసుకొచ్చేందుకు నాసా- స్పేస్‌ఎక్స్‌ సంయుక్తంగా క్రూ-10 మిషన్ చేపట్టాయి. మార్చి 15న కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరిన ఫాల్కన్-9 రాకెట్.. క్రూ డ్రాగన్‌‌ను ఆదివారం ఐఎస్ఎస్‌కు విజయవంతంగా చేరింది.

డాకింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత అందులోని నలుగురు వ్యోమగాములు.. ఐఎస్ఎస్‌లోకి ప్రవేశించారు. మార్చి 13 న క్రూ-10 మిషన్‌ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ, చివరి నిమిషంలో సాంకేతికలోపంతో ఆగిపోయింది. ఫాల్కన్ రాకెట్ -9 హైడ్రాలిక్ వ్యవస్థలో సమస్య తలెత్తడంతో నిలిచిపోయింది. లోపాన్ని సరిచేసి.. రెండు రోజుల్లోనే ప్రయోగానికి సిద్ధమయ్యారు. చివరకు మార్చి 15న ఐఎస్ఎస్‌కు డ్రాగన్ వ్యోమనౌక ప్రయాణం కావడంతో సునీతా విలియమ్స్ రాకకు మార్గం సుగమం అయ్యింది.

సునీతా విలియమ్స్, విల్‌మోర్‌లు.. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10.15 గంటలకు తిరుగుప్రయాణమయ్యారు. 17 గంటల అనంతరం డ్రాగన్ కాప్సూల్ భూవాతావరణంలోకి బుధవారం తెల్లవారుజామున 2.41 గంటలకు ప్రవేశించింది. తర్వాత దాని ఇంజిన్లను ప్రజ్వలింపజేశారు. ఈ సమయంలో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకుంది. తొలుత గంటకు 17 వేల మైళ్ల వేగంతో వ్యోమనౌక భూమి దిశగా పయనించింది. భూమికి చేరువయ్యే కొద్దీ అందులోని పారాచ్యూట్‌లు ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి.

క్రమంగా వేగం తగ్గించుకుంటూ గంటకు 116 మైళ్ల వేగంతో నాలుగు పారాచ్యూట్ల సాయంతో గురుత్వాకర్షణ శక్తిని తట్టుకుంటూ ఫ్లోరిడా తీరంలో క్యాప్సూల్స్‌ సురక్షితంగా దిగింది. సరిగ్గా బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు వ్యోమనౌక భూమికి చేరింది. అనంతరం నాసా, అమెరికా నౌకాదళ సిబ్బంది కాప్సూల్‌ వద్దకు చేరుకుని దానిని వెలికి తీసి… అందులోని వ్యోమగాములను బయటకు తీసుకొచ్చారు. అనంతరం వీరిని హ్యూస్టన్‌లో జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

నాలుగు గంటల పాటు వైద్య పరీక్షలు జరుగుతాయి. తర్వాత వారిని హెలికాప్టర్‌లో అక్కడ నుంచి తరలిస్తారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌తో పాటు నాసా వ్యోమగామి నిక్ హేగ్, రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్‌కు చెందిన గోర్బునోవ్‌లు భూమికి చేరుకున్నారు. డ్రాగన్ కాప్సూల్‌కి నిక్ హేగ్ కమాండర్‌గా వ్యవహరించారు. కాగా, సునీతా విలియమ్స్ మూడోసారి తన అంతరిక్షయానాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి మహిళా వ్యోమగామిగా సునీతా చరిత్ర సృష్టించారు. తొలిసారి 2006, తర్వాత 2012లో రెండోసారి వెళ్లారు. మూడోసారి గతేడాది జూన్ 5న బోయింగ్ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో అంతరిక్షానికి వెళ్లి.. చిక్కుకుపోయారు.

భూమికి సురక్షితంగా చేరుకున్న అనంతరం సునీతా విలిమయస్ బృందం.. అందరికీ హాయ్ చెప్పింది. తర్వాత సహాయక సిబ్బంది బృందం భద్రతా పరీక్షల అనంతరం డ్రాగన్ కాప్సూల్‌ను తెరిచి.. లోపలి నుంచి వ్యోమగాములను బయటకు తీసుకొచ్చారు. ముందుగా నిక్ హేగ్, గోర్బునోవ్‌లు వారి తర్వాత సునీతా విలియమ్స్, విల్‌మోర్‌లు బయటకొచ్చారు. స్ట్రెచర్‌పై వారిని ఎక్కించి… లోపలికి తీసుకెళ్లారు. గత 288 రోజులుగా అంతరిక్షంలో ఉన్న సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరుకోవాలని భారత్‌లోని ఆమె సొంత రాష్ట్రం గుజరాత్‌లోని బంధువులు యజ్ఞ‌ం, పూజలు నిర్వహించారు. సునీతా విలియమ్స్‌ పూర్వీకులు ఝూలాసన్‌లో ఉంటున్నారు. ఆమె రాకపై సునీతా సోదరుడు దినేష్ రావల్‌ సంతోషం వ్యక్తం చేశారు.

Related posts

హైదరాబాద్ పోలీసులకు కరోనా కాటు

Satyam NEWS

మంగళగిరిలో అనుమానితుల సంచారం

Sub Editor

డిప్యూటీ డిఎంహెచ్ ఓ సస్పెండ్

mamatha

Leave a Comment

error: Content is protected !!