ఎన్నికలు జరగబోతున్న వేళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పెద్ద చిక్కులో ఇరుకున్నారు. 2014 ఎన్నికల సందర్భంగా ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ లో రెండు క్రిమినల్ కేసులను ఉద్దేశ్యపూర్వకంగా దాచిపెట్టారనే పిటిషన్ పై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. ఆయన ఉద్దేశ్యపూర్వకంగా రెండు క్రిమినల్ కేసులను దాచిపెట్టినందున కేసు ను ఎదుర్కోవాల్సిందేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది. అంతకు ముందు స్థానిక కోర్టు, ముంబయి హైకోర్టు దేవేంద్ర ఫడ్నవీస్ కుఇచ్చిన క్లీన్ చిట్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టవేసింది. దేవేంద్ర ఫడ్నవీస్ రెండు కేసులను ఉద్దేశ్యపూర్వకంగా దాచిపెట్టారని ఆరోపిస్తూ న్యాయవాది సతీష్ ఉఖే కేసు దాఖలు చేయగా కింది కోర్టులలో దేవేంద్ర ఫడ్నవీస్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. దాంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు కేసును పరిశీలించిన తర్వాత ఈ ఏడాది జులైలో తీర్పును రిజర్వులో పెట్టింది. కాగా నేడు తీర్పు వెల్లడించింది. రెండు క్రిమినల్ కేసులను ఎన్నికల అఫిడవిట్ లో చెప్పకుండా దాచిపెట్టినందుకు ప్రజాప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 125ఏ ను ఉల్లంఘించినట్లుగా భావించాలని, అందుకు సంబంధించిన కేసును నడపాలని కోర్టు సూచించింది. ఈ సెక్షన్ కింద కేసు రుజువు అయితే దేవేంద్ర ఫడ్నవీస్ కు రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష లేదా అంతకు మించిన శిక్ష విధించే అవకాశం ఉంది. దేవేంద్ర ఫడ్నవీస్ పై 1996, 1998 సంవత్సరాలలో ఫోర్జరీ, ఛీటింగ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఆ కేసులలో ఇప్పటి వరకూ చార్జిషీట్ దాఖలు చేయలేదు. అయితే ఈ కేసులకు సంబంధించిన ఫిర్యాదులను స్థానిక కోర్టు పరిగణనలోకి తీసుకున్నందున ఆయనపై కేసులు ఉన్నట్లుగానే సుప్రీంకోర్టు భావించింది. ఎన్నికల సమయంలో దేవేంద్రఫడ్నవీస్ పై సుప్రీంకోర్టు ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం బిజెపికి ఊహించని దెబ్బ.
previous post
next post