నేడు ఎస్సీ వర్గీకరణపై సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 6:1 తేడాతో తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ 30 ఏండ్ల పోరాటానికి ఫలితం దక్కిందని అన్నారు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని 2004లోనే చెప్పానన్నారు. అధర్మం తాత్కాలికమైనని వెల్లడించారు. వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఈ విజయం కోసమే 30 ఏండ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
ఉద్యమాలను దెబ్బతీసే కుట్రలు ఎన్నో జరిగాయని విమర్శించారు. అయినా సహనం కోల్పోకుండా పట్టుదలతో పోరాటం చేసి విజయం సాధించామని తెలిపారు. 1994లో ప్రకాశం జిల్లా ఈదుమూడిలో వర్గీకరణ ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు పోరాడామన్నారు. న్యాయం కోసం ఎమ్మార్పీఎస్‌కు అండగా నిలిచిన వారందరికీ ఈ విజయం అంకితం ఇస్తున్నామన్నారు. ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు కూడా సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
వర్గీకరణకు జనాభా లెక్కలతో పనిలేదని చెప్పారు. వర్గీకరణ కోసం ప్రధాని మోదీ చొరవ తీసుకున్నారని చెప్పారు. అనుకూల తీర్పునిచ్చిన జడ్జిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని 2004 నవంబర్ 5న చెప్పానని గుర్తుచేశారు. త్వరలో విజయోత్సవ సభ నిర్వహిస్తామని, సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతామన్నారు.