కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి పి.చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే సిబిఐ అధికారులు అరెస్టు చేసినందున ఈ పిటిషన్ పై విచారణ జరపాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే అరెస్టు కంటే ముందే తాము ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని, అందువల్ల దానిపై విచారణ జరపాలని చిదంబరం తరఫు న్యాయవాది కోరారు. దీనికి ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. చిదంబరం అరెస్టైనందున ఇప్పుడు ఆ పిటిషన్‌కు అర్హత లేదని పేర్కొంది. ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో చిదంబరం దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు గతవారం తోసిపుచ్చింది. ఈ కుంభకోణం మొత్తానికి చిదంబరమే ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు అర్థమవుతోందని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్‌పై తక్షణ విచారణ జరిపేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో గత బుధవారం సీబీఐ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు ఢిల్లీ హైకోర్టు ఉత‍్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. బెయిల్ కోసం చిదంబరం సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానాన్ని ఆశ్రయించవచ్చని పేర్కొంది. మరోవైపు సీబీఐ రిమాండ్‌ను సవాల్ చేస్తూ చిదంబరం న్యాయవాదులు ఎలాంటి పిటిషన్ దాఖలు చేయనందున దీనిపై తాము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని న్యాయమూర్తి జస్టిస్ ఆర్ భానుమతి పేర్కొన్నారు.
previous post
next post