20.7 C
Hyderabad
February 5, 2023 02: 54 AM
Slider సంపాదకీయం

వై ఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో కీలక మలుపు

#supremecourtofindia

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేదిగా ఉంది. జగన్ మోహన్ రెడ్డి కి వరుసకు సోదరి అయ్యే వై ఎస్ సునీత అభ్యర్ధన మేరకు ఈ నిర్ణయం జరగడం మరింత చర్చనీయాంశం.

సొంత బాబాయి హత్య కేసు విచారణ సక్రమంగా జరగకపోవడం, దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే రాష్ట్ర పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టడం తదితర చర్యల పర్యవసానంగా సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం అంత సున్నితంగా ఆలోచించే అవకాశం లేదు కానీ కచ్చితంగా సుప్రీంకోర్టు నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు తీరని మచ్చ లాంటిదే.

వివేకానందరెడ్డి అకస్మాత్తుగా గుండె పోటు వచ్చి మరణించారని హత్య జరిగిన కొన్ని గంటల తర్వాత వై ఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు అయిన విజయసాయిరెడ్డి ప్రకటించిన విషయం ఇంకా ఎవరి స్మృతి పథం నుంచి చెరగిపోలేదు.

ఆ తర్వాత వివేకానందరెడ్డిని ఎవరో దారుణంగా హత్య చేశారని విజయసాయిరెడ్డి చెప్పాల్సి వచ్చింది. అప్పటికే రక్తం తుడిచేయడం, గొడ్డలి వేటుకు కుట్లు వేయడం జరిగిపోయాయి. ఆ నాటి నుంచి ఎన్నో పరిణామాలు జరిగాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తును కోరిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ తర్వాత అధికారంలోకి రాగానే సీబీఐ దర్యాప్తు అవసరం లేదని తేల్చి చెప్పారు.

అయితే ఆయన సోదరి, వై ఎస్ వివేకా కుమార్తె పట్టువీడకుండా సీబీఐ దర్యాప్తు కావాలని కోరడంతో కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. సీబీఐ దర్యాప్తు సందర్భంగా అధికారులను ఎవరో పనిగట్టుకుని వత్తిడి చేసి మార్చినట్లు కూడా ఆరోపణలు వినవచ్చాయి.

ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు కూడా మందగించింది. అనంతరం కొత్తగా వచ్చిన సీబీఐ దర్యాప్తు అధికారులు కేసు దర్యాప్తును వేగవంతం చేసిన క్రమంలో వారికి తీవ్ర అడ్డంకులు ఎదురయ్యాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా సీబీఐ అధికారులపైనే కేసులు పెట్టారు. రాష్ట్ర పోలీసుల కేసులకు భయపడి సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.

జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి సోదరి వై ఎస్ వివేకా కుమార్తె తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కోడి కత్తి కేసులో ‘‘రాష్ట్ర పోలీసులపై నాకు నమ్మకం లేదు’’ అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లే ఆయన సోదరి వై ఎస్ సునీత ఇప్పుడు చెబుతున్నారు. రాష్ట్ర పోలీసులు సహకరించడం లేదని, పైగా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆమె కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చింది.

కడప పార్లమెంటు స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలనే అంశంపై వచ్చిన విభేదాల కారణంగానే వై ఎస్ వివేకా హత్య జరిగిఉంటుందనే అనుమానాన్ని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వై ఎస్ షర్మిల కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. వివేకా హత్య కేసుకు సంబంధించిన అన్ని పరిణామాలూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్దేశాలు ఆపాదించేవే కావడం గమనార్హం.

అయితే ఈ విషయాలను వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదని ఇప్పటికే పలుమార్లు స్పష్టం అయింది కాబట్టి ఇక ప్రభుత్వ పరువు ప్రతిష్ట పోతుందని, ప్రభుత్వ లేదా పోలీసుల విశ్వసనీయత తగ్గిపోతుందనే వాదనలకు తావు లేదు. వివేకా హత్య జరిగి చాలా కాలం గడచిపోయినా న్యాయం జరగడం లేదని ఆయన కుమార్తె ఆవేదన తీరే పరిస్థితి ఇప్పటి వరకూ లేదు.

ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్యకేసు విచారణ తెలంగాణ రాష్ట్రానికి సుప్రీం కోర్టు బదిలీ చేయడంతో కొంత మేరకు ఆమె ఆవేదన తీరే మార్గం కనిపించినట్లయింది. న్యాయం జరగడమే కాదు… న్యాయం చేసినట్లు కనిపించాలి అనే సూత్రానికి అనుగుణంగా న్యాయస్థానాల ఆధ్వర్యంలో జరుగుతున్న పరిణామాలు సామాన్య ప్రజలు కూడా హర్షిస్తున్నారు.

వివేకా హత్య కేసులో దోషులు ఎవరో అందరికి తెలిసినా ఎవరూ చెప్పని పరిస్థితి. దర్యాప్తు బృందం ముందుకు సాగలేని పరిస్థితి. దర్యాప్తు బృందం సేకరించిన ఆధారాలు న్యాయస్థానాల్లో నిలబడతాయో లేదో చెప్పలేని పరిస్థితి. అంటే… వివేకా కుమార్తె సునీత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇంతటి మేలిమి తీర్పు ఇచ్చినా కూడా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయనేది నిర్వివాదాంశం.

హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టుకు ఈ కేసును బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసం తీర్పునివ్వడం దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ కి కూడా కొంత బలాన్ని చేకూరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తున్న అడ్డంకులను దాటుకోవడానికి సీబీఐ పడుతున్న వేదన అంతా ఇంతా కాదు.

ఆ పరిస్థితుల్లో వారికి కూడా నైతిక బలాన్ని చేకూర్చేదిగా సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయం ఉండటం హర్షణీయం. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పుతో సీబీఐ కి కూడా కొత్త ఉత్సాహం రావచ్చు. కేసు దర్యాప్తు వేగిరం కావచ్చు. నేర విచారణ నిష్పాక్షికంగా జరపడం కోసమే విచారణను బదిలీ చేసినట్లు సుప్రీంకోర్టు వెలిబుచ్చిన అభిప్రాయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నిజం నిగ్గు తేల్చడానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందని భావించవచ్చు. ప్రజల మన్నననలు పొందిన నాయకుడు, సాత్వికుడు, ప్రజల లోనే అను నిత్యం కాలం గడిపిన ప్రజా నాయకుడు అయిన వై ఎస్ వివేకానందరెడ్డిని అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపి, ఆనవాలు లేకుండా చేయడం కోసం శవానికి కుట్లు వేసి, రక్తం కడిగివేసిన ఆ కిరాతకులు ఎవరైనా వారికి శిక్ష పడాల్సి ఉంది. అందుకు తొలి సోపానంగా సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.  

Related posts

కార్మిక చట్టాలను కాలరాస్తున్న మోదీ సర్కార్: ఏఐటియుసి

Bhavani

హన్మకొండలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం

Satyam NEWS

రచయితల సంఘాన్ని బెదిరించిన ఉప సర్పంచ్ భర్త

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!