బాలివుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి చేసిన కేసులో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఆకాష్ కైలాష్ కన్నోజియా (31) అనే వ్యక్తి ఈ చర్యకు పాల్పడినట్లు సీసీ టీవీ ఫుటేజి ద్వారా ముంబయి పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని అన్ని పోలీసు స్టేషన్లకు తెలియపరచడంతో ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వే స్టేషన్ కు చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారులు శనివారం మధ్యాహ్నం అతడిని అరెస్టు చేశారు. ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ (LTT), కోల్‌కతా షాలిమార్ మధ్య నడిచే జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో అతను ప్రయాణిస్తున్నట్లు ముందుగా గుర్తించారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు, జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న నిందితుడి గురించి ముంబై పోలీసుల నుండి ఆర్‌పిఎఫ్ పోస్ట్ దుర్గ్ వారు సమాచారం అందుకున్నారు. అతని మొబైల్ ఫోన్, అతని ఫోటో, అతను ఉన్న లొకేషన్‌ను షేర్ చేశారు. అయితే RPF పోలీసులు రాజ్‌నంద్‌గావ్ స్టేషన్‌లో (ముంబై-హౌరా మార్గంలో దుర్గ్‌కు ముందు వస్తుంది) వద్ద తన సిబ్బందిని అప్రమత్తం చేశారు. అయితే రైలు అక్కడ ఆగినప్పుడు నిందితుడి ఆచూకీ లభించలేదని అధికారి తెలిపారు. దాంతో దుర్గ్ స్టేషన్‌లో రెండు బృందాలను సిద్ధంగా ఉంచారు. రైలు రాగానే ముందు జనరల్ కంపార్ట్‌మెంట్‌లో అనుమానితుడు కనిపించాడని తెలిపారు.
అతని ఫోటోను ముంబై పోలీసులకు పంపారు. వారు అతని గుర్తింపును ధృవీకరించారు. సినీనటుడు ఖాన్‌పై దాడి చేసిన అతను భవనం వద్ద మెట్లు దిగుతుండగా సీసీటీవీ ఫుటేజీలో కనిపించాడు. ముంబై పోలీసు బృందం సాయంత్రం విమానంలో రాయ్‌పూర్ చేరుకుని అతనిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రముఖ బాలీవుడ్ స్టార్ ఖాన్ (54) గురువారం తెల్లవారుజామున ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని తన 12వ అంతస్తు నివాసంలో దోపిడీకి ప్రయత్నించిన సమయంలో ఒక ఆగంతకుడు పదే పదే కత్తితో పొడిచాడు. అతనికి చికిత్స చేస్తున్న వైద్యులు చెప్పిన ప్రకారం, నటుడు గాయాల నుండి కోలుకుంటున్నాడు.