తిరుమల శ్రీవారి పుష్కరిణిని నెల రోజుల పాటు మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. నీటి తొలగింపు, పైపులైన్ల మరమ్మతులు, ఇతర పనులు కారణంగా మూసివేస్తున్నారు. తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులు స్వామి వారి దర్శనానికి ముందు శ్రీవారి పుష్కరిణిలో (కోనేరు) స్నానం చేయడం ఆనవాయితీ. తలనీలాలు సమర్పించిన భక్తులతో పాటుగా ఇతర భక్తులు కూడా కోనేట్లో స్నానం చేసి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి నెల రోజుల పాటు ఆ సౌకర్యాం ఉండదు.
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఉన్న పుష్కరిణిని ఆగస్ట్ 1 నుంచి 31వ తేదీ వరకూ మూసివేయనున్నారు. ఇంకో రెండు నెలల్లో శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పుష్కరిణి వార్షిక నిర్వహణా పనులను చేపట్టడానికి పుష్కరిణిని నెల రోజుల పాటు మూసి వేయాలని నిర్ణయించారు. మొదట పది రోజుల పాటు నీటిని తోడి వేస్తారు. ఆ తరువాత పది రోజులు మరమ్మతులు ఏవైనా ఉంటే పూర్తి చేస్తారు. చివరి పది రోజులు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు. పుష్కరిణిలోని నీటి పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ విలువ 7 ఉండేలా చూస్తారు. పీహెచ్ 7 అనేది నీరు ఎంత శుద్ధంగా ఉంటుందనేది తెలియజేస్తుంది. టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు కొనసాగనున్నాయి.