పిల్లచేష్టలతో అనుభవ రాహిత్యంతో ముఖ్యమంత్రి తీసుకున్న తెలివితక్కువ నిర్ణయం పక్కన పెట్టి తెలుగుదేశం ప్రారంభించిన అభివృద్ధిని కొనసాగించాలని మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు.
కృష్ణాజిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో దేవినేని మాట్లాడుతూ విశాఖపట్నం చుట్టు ప్రక్కల జగన్ సూచనల మేరకు మధురవాడ, భోగాపురం ప్రాంతంలో విజయసాయి రెడ్డి తో పాటు వైకాపా నేతలు 6వేల ఎకరాల భూములు కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. విశాఖ ప్రాంతంలో వైకాపా నేతలు చేసిన ఇన్ సైడ్ ట్రేడింగ్ పై సీబీఐ విచారణ జరిగితే నిజానిజాలు బయటకు వస్తాయని అన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే ముఖ్యమంత్రి జగన్ అమరావతి వికేంద్రీకరణ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ అమరావతి వికేంద్రీకరణ కాదు అని ఆయన అన్నారు. జగన్ తెలివితక్కువ నిర్ణయాలతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి కుల మతాలకు ప్రాంతాలకు మధ్య చిచ్చు పెడుతున్నాడు.
ఏడు నెలలుగా కుట్రలు కుతంత్రాలతో కూడిన ఆలోచనలతో శాసన సభ్యులు మంత్రులతో ప్రకటనలు గుప్పించి నేడు 9వేల కోట్ల పైనే పనులు జరిగిన అమరావతి గొంతుకోశారు. అమరావతి కేంద్రంగా అన్ని శాఖలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంటే ఓర్వలేక, తట్టుకోలేక జగన్ ఇటువంటి కుట్రలకు పాల్పడ్డాడు అంటూ ఆయన తీవ్రంగా విమర్శించారు.