ఎన్నికల సమయంలో చెప్పకుండా, నవ రత్నాలలో పెట్టకుండా రాజధాని మార్చే అధికారం జగన్ కు ఎవరు ఇచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. పరిపాలన చేతకాకపోతే పదవి నుంచి తప్పుకోవాలని ప్రజలే డిమాండ్ చేస్తున్నారని ఆయన అన్నారు.
రాజధానిపై నివేదిక సమర్పించాలని పని అప్పగించిన బోస్టన్ కన్సల్టెన్సీ కంపెనీ గ్రూపుల పై అనేక ఆరోపణలు ఉన్నాయని ఆయన అన్నారు. ఐదు కోట్ల మంది ప్రజల భవితవ్యం నిర్ణయించేందుకు అవినీతి కంపెనీకి బాధ్యత ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. జి.యన్.రావు వంద మీటర్లు కూడా నడవలేడు. పదివేల కిలోమీటర్ల నడిచారంటే నమ్ముతారా అని ఆయన ప్రశ్నించారు.
జి.యన్. రావు అసలు ఎవరెవరిని కలిశారో సమాచార హక్కు చట్టం ద్వారా సేకరిస్తామని దేవినేని ఉమ తెలిపారు. రాజధాని పై ప్రకటన చేయడానికి విజయసాయి రెడ్డి కి ఏమి అర్హత ఉందని ఆయన ప్రశ్నించారు. విశాఖలో భూములు కొనుగోళ్లు, వాల్తేరు క్లబ్, వంటి అంశాలపై సిబిఐ తో విచారణ చేయించాలని, భీమిలి, భోగాపురం ఎయిర్ పోర్ట్ వద్ద 6వేల ఎకరాలు చేతులు మారాయని ఆయన అన్నారు.
విశాఖ లో 36వేల ఎకరాల కొనుగోలులో వైసిపి ఎమ్మెల్యే లు, నేతలు ఇన్ సైడ్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని తెలుగుదేశం నాయకుడు దేవినేని ఉమ ఆరోపించారు. విశాఖ లో భూ కబ్జాలు, దందాలు పెద్ద ఎత్తున సాగుతున్నట్లు పత్రికలలో వార్తలు వచ్చాయని, విశాఖలో ముఠాల కలకలం పేరుతో సెప్టెంబరు లో వచ్చిన వార్తలు పై జగన్ ఏమి చెబుతారని ఆయన ప్రశ్నించారు.