జిల్లా కలెక్టర్ పై త్రీవ విమర్శలు చేసిన కోవూరు శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నాలుగు రోజులు గడవక ముందే ఆయనపై ప్రశంసలు కురిపించడం వెనుక మతలబు ఏమిటని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ప్రశ్నించారు.
కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నదే ప్రసన్న కుమార్ రెడ్డి నైజం లాగా కనిపిస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లా కలెక్టర్ పై తీవ్రాతి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డికి ఆయన పార్టీ వాళ్లే మద్దతు ఇవ్వలేని దాంతో కలెక్టర్ తో కాళ్లబేరానికి వచ్చాడని చేజర్ల అన్నారు.
జిల్లా ప్రజలకు ప్రసన్నకుమార్ రెడ్డి క్షమాపణ చెప్పాలి
ఈనెల 2 వ తేదీన ప్రసన్నకుమార్ రెడ్డి జిల్లా కలెక్టరు, ఎస్పీ లను ఏక వచనం తో సంబోధిస్తూ వారిపై త్రీవరమైన ఆరోపణలు చేసారని, అయితే తమ సొంత పార్టీలొనే ఏ ఒక్క నాయకుడు ఆయనకు మద్దతుగా మాట్లాడలేదని చేజర్ల అన్నారు. ఆ పార్టీలో ఒంటరిగా మిగిలిపోవడంతో గత్యంతరం లేక ప్రసన్నకుమార్ రెడ్డి కలెక్టర్ ను బ్రతిమిలాడి కొవూరుకు తెచ్చుకున్నారని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధికారులు అందరూ బాగా పనిచేస్తున్నారని మాట్లాడారని చెప్పిన ప్రసన్న కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ గారిపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నారో లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆరోజు ఆ విధంగా మాట్లాడినదానికి క్షమాపణలు చెప్పాలని చేజర్ల డిమాండ్ చేశారు.
చంద్రబాబును తిట్టడం కాదు ప్రజలకు సాయం చేయండి
నిన్న విశాఖ లో గ్యాస్ లీకై అందరూ అక్కడ ఏం జరుగుతోంది అని ఆతృత గా ఉంటే ఆ సమయంలో కూడా ప్రసన్నకుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చేసారని, సమయం సందర్భంగా లేకుండా చంద్రబాబు నాయుడు ను తిట్టడం మాని కరోనా వల్ల కోవూరు ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగించాలని ఆయన ప్రసన్న కుమార్ రెడ్డికి హితవు చెప్పారు.
ప్రభుత్వం ఇచ్చిన వెయ్యి రూపాయలు ఆర్ధిక సహాయం కోవూరు నియోజకవర్గం లో అర్హత కలిగిన 12 వెల మందికి అందలేదని, చాలా మందికి బియ్యం, కందిపప్పు అందలేదని సీపీఎం పార్టీ చేసిన సర్వేలో వెల్లడైందని, శాసనసభ్యుడి గా ఒక్క రోజైన వీటి పైన సమీక్ష చేయలేదని ఆయన అన్నారు.
ఇతర రాష్ట్రాలలో ఇచ్చిన సాయం కూడా ఇవ్వలేదేం?
అదేవిధంగా తెలంగాణలో ప్రతి కుటుంబానికి రూ 3వేలు నగదు,24 కేజీ ల బియ్యం ఇచ్చారని,కర్ణాటకలో ప్రతి కుటుంబానికి రూ5వేలు నగదు ఇచ్చారని కేరళలో రూ 3 వేల నిండి 5 వేలు నగదు ఇచ్చారని కానీ ఏపిలో కేంద్రం ఇచ్చిన వెయ్యి రూపాయలు, బియ్యం,కందిపప్పు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏమి ఇవ్వలేదని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు ను తిట్టడం మాని ముఖ్యమంత్రి తో మాట్లాడి ప్రతి కుటుంబానికి రూ 5 వేలు ఆర్ధిక సహాయం చేయించాలని అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెనుమల్లి శ్రీహరి రెడ్డి, ఇందుపురు మురళీకృష్ణ రెడ్డి, ఇంటూరు విజయ్ తదితరులు పాల్గొన్నారు.