గుడివాడలో ఉల్లిపాయల కోసం క్యూలైన్లో నిలబడి మృతిచెందిన నూనె సాంబయ్యరెడ్డి కుటుంబాన్ని, తొక్కిసలాటలో గాయపడిన మహిళ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.
ఉల్లిపాయల కోసం ఉద్యోగాలను వదిలి ఉద్యోగస్తులు, స్కూళ్లకు సెలవు పెట్టి విద్యార్థులు, అన్ని పనులను వదిలి ప్రజలు ఉల్లిపాయల కోసం బారులు తీరాల్సిన పరిస్థితి జగన్ ప్రభుత్వంలో ఏర్పడిందని అన్నారు. గుడివాడ రైతు బజార్ లో ఉల్లిపాయల కోసం క్యూలైన్లో నిలబడి మృతిచెందిన నూనె సాంబయ్యరెడ్డి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇచ్చి వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని అదేవిధంగా అదే తొక్కిసలాటలో గాయపడ్డ మహిళ కుటుంబాన్ని ఆదుకోవాలని దేవినేని డిమాండ్ చేశారు.
వైసిపి నాయకులు చెపుతున్నట్లు ఉల్లిపాయలు ప్రజలకు అందుబాటులో ఉంటే కిలోమీటర్ల పొడవున గంటల తరబడి క్యూ లైన్ లో నుంచోవాల్సిన అవసరము ప్రజలకు ఏముందని దేవినేని ప్రశ్నించారు. ఉల్లిపాయల కోసం క్యూలైన్లో నిలబడి ప్రజల ప్రాణాలు కోల్పోవడం నేడే చూస్తున్నామని ఉల్లిపాయలతో పాటు నిత్యావసరాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని దేవినేని డిమాండ్ చేశారు.
విజయవాడ పిడబ్ల్యుడి గ్రౌండ్స్ లోని రైతు బజార్ ను దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, ఎమ్మెల్సీ సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, బోడె ప్రసాద్ లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఉల్లిపాయల కోసం బారులు తీరిన ప్రజలు తమ బాధలను నాయకులకు చెప్పారు.