తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి కుమారుడు లోకేష్ అప్పుడప్పుడు ఎక్కువ ఉత్సాహం చూపిస్తుంటాడు. తాను ఎంత ఉత్సాహంగా సోషల్ మీడియాలో ఉంటే తెలుగుదేశం కార్యకర్తలు అంత ఉత్సాహంగా పని చేస్తారని అనుకుంటున్నాడేమో తెలియదు. దీనికోసం లోకేష్ సోషల్ మీడియాను ఈ మధ్య బాగా ఉపయోగించుకుంటున్నాడు. క్షేత్ర స్థాయిలో పని చేయడానికి ఉత్సాహం చూపించని లోకేష్ ట్విట్టర్ ఆధారంగా ప్రాచుర్యం పొందాలని చూస్తున్నట్లుగా కనిపిస్తున్నది. లోకేష్ స్వయంగా ఇలా తెలుగులో టైప్ చేసి ట్విట్టర్లో పెడుతున్నాడని ఎవరూ అనుకోరు. ఆయన ఎవరో ఒకరినో టీమ్ నో పెట్టుకుని ఉంటాడు. వారు తన పేరుతో ట్విట్టర్లో ఏం పెడుతున్నారో తెలుసుకోకపోతే ట్రబుల్ లో ల్యాండ్ అవ్వడం ఖాయం. ట్విట్టర్ లో తనను వైసీపీ బద్ నామ్ చేసిందని ఆ ట్విట్టర్ ద్వారానే బదులు తీర్చుకుందామంటే కుదరకపోవచ్చు. ఇది రాజకీయం. అందువల్ల క్షేత్ర స్థాయిలో పని చేయడం, కార్యకర్తలకు ఉత్సాహం ఇవ్వడం, నాయకులు చేజారకుండా చూసుకోవడం, అందుకు తగిన వ్యూహాలు రూపొందించుకోవడం చేయాల్సిందే తప్ప ట్విట్లర్ తో పోరాటం చేస్తామంటే కుదరదు. పైగా ఏ మాత్రం విలువలేని వ్యాఖ్యలతో అసలు సాధ్యం కాదు. ఉదాహరణకు నేడు లోకేష్ ట్విట్టర్ లో పెట్టిన ఈ కామెంటు చూడండి.
తుగ్లక్ 2.0 సమస్యకి పరిష్కారం జగన్ గారూ !
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, హైదరాబాద్ రావడం ఖర్చుతో కూడుకున్నది అని కోర్టుకి కహానీలు ఎందుకు చెప్పడం….
దోచుకున్న లక్ష కోట్లు రాష్ట్ర ఖజానాకి అప్పగిస్తే సరిపోలా !!
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, ఖజానా నిండుతుంది.
అంతే కాకుండా, మీరు ప్రతి శుక్రవారం హైదరాబాద్ వెళ్లి రావడానికి అయ్యే భద్రత, రవాణా ఖర్చులకి, ప్రభుత్వానికి నిధులు కూడా సమకూరుతాయి
ఇంత సులువైన పరిష్కారం ఉండగా మినహాయింపు ఎందుకు మాస్టారు.
శిక్ష ఎలాగో తప్పదుగా !
#100DaysThughlaqJagan
ట్విట్టర్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
జగన్ లక్షకోట్లు దోచుకుంటే నిన్నటి వరకూ నువ్వూ, నీ తండ్రే కదా అధికారంలో ఉన్నది, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో కలిసి పని చేసింది మరి ఆ సమయంలో జగన్ ను జైల్ లో వేసే చర్యలు ఎందుకు తీసుకోలేదు? జగన్ కు శిక్ష ఎందుక వేయించలేదు? లక్ష కోట్లు ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? అని ప్రశ్నించడానికి అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలాంటి ఆరోపణలు చాలా చేశారు. అయినా ప్రజలు ఓట్లేసి 151 సీట్లలో వైసిపిని గెలిపించారు. కనీసం ఈ గెలుపు పాతబడే వరకన్నా ఆగకుండా లోకేష్ బాబు ట్విట్టర్ లో ఆత్రం ప్రదర్శిస్తున్నారు.