38.2 C
Hyderabad
April 25, 2024 13: 23 PM
Slider ముఖ్యంశాలు

అప్పుడే తాడేపల్లిలో వణుకు మొదలైంది

#raghurama

అభివృద్ధికి కేరాఫ్ గా మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత  చంద్రబాబు నాయుడు పేరు తెచ్చుకున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి  ఆయన అహర్నిశలు కృషి చేశారు. అభివృద్ధితో ఏదైనా సాధ్యమేనని చంద్రబాబు నాయుడు నిరూపించారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు  రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. నాలుగు కీలక అంశములతో మహానాడులో ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టో ను చూసిన రాష్ట్రంలోని మహిళలు, యువతులు ముక్తకంఠంతో, ఒక్క ఓటు కూడా తప్పిపోకుండా  తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారనడంలో  సందేహం లేదన్నారు.

సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు చేస్తానంటున్నది నిజమైన మహిళా సంక్షేమం. దారిద్ర రేఖ కు దిగువన ఉన్న   18  సంవత్సరాలు దాటిన  పేద యువతులు, మహిళలను గుర్తించి ప్రతి నెల వారికి  1500 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించడం అత్యద్భుతం. చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఈ హామీని మహిళా లోకం విశ్వసించి గెలిపిస్తే, ఆయన తప్పకుండా అమలు చేసి చూపిస్తారన్న  నమ్మకం ఉంది.

ఆసరా పేరిట తమ పార్టీ ప్రభుత్వం కూడా కొంతమందికి  ఇస్తూ, మరి కొంతమందికి ఎగ్గొడుతున్నారు.  పల్లెటూర్ల నుండి  జిల్లా కేంద్రాలకు, పట్టణాలకు వెళ్లి చిరు వ్యాపారాలు చేసుకునే  మహిళలకు, యువతులకు   ఆర్టిసి బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన ఆహ్వానించాల్సిందే. అలాగే ప్రతి పేద కుటుంబానికి మూడు ఉచిత సిలిండర్లు  అందజేస్తామన్న హామీ  అమలన్నది సాధ్యమే. ఒక్కొక్క కుటుంబానికి మూడు సిలిండర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించేది కేవలం 3600 మాత్రమేనని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ హామీ ఇచ్చి,  అధికారంలోకి వచ్చిన వెంటనే అమలుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది .

తెలుగుదేశం పార్టీ మినీ  మేనిఫెస్టో ప్రకటన అనంతరం మా పార్టీ నాయకత్వం కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులను రంగంలోకి దింపి, విమర్శలు గుప్పించడం హాస్యాస్పదంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల అమలు సాధ్యం కాదని మా పార్టీ తరఫున మాట్లాడిన కొందరు వ్యక్తులు పేర్కొనడం విడ్డూరం. అధికారంలోకి వచ్చిన తర్వాత  పేదల ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని జగనన్న చదివిస్తారని ముఖ్యమంత్రి సతీమణి భారతీ రెడ్డి  చెప్పారు. కానీ ఆ హామీ అమలుకు  నోచుకోలేదు.

జగనన్న తన సొంత డబ్బులతో  పేదింటి పిల్లలను చదివిస్తున్నట్టుగా ఆమె భావించారు. మా పార్టీ ప్రభుత్వం ఏదైతే చెప్పి మోసం చేసిందో, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొనడం  స్వాగతించాల్సిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎగదొబ్బింది,  చంద్రబాబు నాయుడు అమలు చేసి చూపిస్తామని అంటున్నారు. కానీ ఆయన చేయలేరని  మా పార్టీ నాయకులు పేర్కొనడం విస్మయాన్ని కలిగిస్తోంది. నిరుద్యోగ భృతి  గతంలో 200 నుంచి 2000 రూపాయలకు పెంచిన ఘనత  చంద్రబాబు నాయుడుదే. 2000 రూపాయల నిరుద్యోగ భృతిని 2250 కి పెంచి ఇస్తామని   జగన్మోహన్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు వేసిన బాటలోనే గతం లో జగన్మోహన్ రెడ్డి  పరుగెత్తారని గుర్తించాలన్నారు.

పారిశ్రామికవేత్తలను రాష్ట్రం నుండి తరిమికొట్టారు

టిడిపి మేనిఫెస్టో ప్రకటనపై  విమర్శలు ఎందుకు?. సామాన్యుడికి సహాయం అందకూడదా?, ఏదైనా చేస్తే మనమే చేసినట్టు బిల్డప్ ఇవ్వాలా?? అంటూ రఘురామకృష్ణంరాజు  ఎద్దేవా చేశారు. సంక్షేమం పేరిట రాష్ట్రంలో అభివృద్ధిని మా పార్టీ ప్రభుత్వం సంకనాకించింది. పరిశ్రమలలో వాటాలు అడుగుతూ, పారిశ్రామికవేత్తలను ప్రభుత్వ పెద్దలు తరిమికొట్టారు. రాష్ట్రానికి రావలసిన ఆదాయాన్ని వాళ్లకు వీళ్ళకు  విక్రయించి వ్యక్తిగతంగా సొమ్ము చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచుతానని చంద్రబాబు నాయుడు పేర్కొంటున్నారు. ఆ ఆదాయాన్ని  పేదలకు పంచుతామని వెల్లడించారు.

అప్పుచేసి  పప్పు కూడు తినే బ్యాచ్ మా పార్టీ ప్రభుత్వానిదైతే, అభివృద్ధి చేసి పప్పు కూడు  తినే బ్యాచ్ ప్రతిపక్షానిది. అభివృద్ధి చేస్తే రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అప్పుడు ఆటోమేటిగ్గా  నిరుద్యోగుల సంఖ్య తగ్గిపోతుంది. నిరుద్యోగ భృతిని సులభంగా  ఉన్న కొద్దిమందికి అందజేయవచ్చు. ఇటువంటి ఐడియా పాలక పక్షమైన  మనకు రానందుకు సిగ్గు పడుదాం. ప్రతిపక్ష పార్టీకి వచ్చినందుకు సంతోషిద్దాం. మిగిలి ఉన్న ఈ నాలుగైదు నెలలైనా మనము చేయగలిగింది చేద్దాం. లేకపోతే అన్నీ  మూసుకు కూర్చుంటే మంచిది. లేకపోతే మన ప్రభుత్వంపై  మరింత   ప్రజాగ్రహం పెళ్లు బికుతుందని  రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. అభివృద్ధి అంటూ చేస్తే  తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలన్నీ ఆచరణ సాధ్యమే. మనకు అభివృద్ధిపై  ధ్యాసే లేదు. మన గురి అంతా ఎప్పుడు విధ్వంసం పైనేనని ఆయన విమర్శించారు.

ప్రభుత్వానికి మృత్యుగంటికలు మోగుతున్నాయి

రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడుకు రాష్ట్ర నలుమూలల నుంచి ఆ పార్టీ శ్రేణులు హాజరు కాకుండా  మా పార్టీ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులను సృష్టించిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. అయినా స్వచ్ఛందంగా లక్షలాదిమంది  కార్యకర్తలు మహానాడుకు తరలి రావడం చూస్తే, మా పార్టీ ప్రభుత్వానికి మృత్యుగంటలు మోగుతున్నాయని  స్పష్టమవుతోంది . సభా ప్రాంగణంలో  గాలి తుఫాను వచ్చినప్పటికీ, కార్యకర్తలు బెదరలేదు. అక్కడ నుంచి అడుగు కూడా ముందుకు  కదలలేదు. ఎక్కడ కూర్చున్న వారు అక్కడే  కూర్చుండి పోయారు. అంటే మా పార్టీ ప్రభుత్వంపై ప్రజాగ్రహము  ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది.

ఈ ప్రభుత్వం నుండి ఊరట కోసం జనం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఈ తలకాయ నొప్పి వదిలిపోతుందా అని నిరీక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి సభలకు బలవంతంగా తీసుకువచ్చిన ప్రజలు కంద కాలు తవ్వినా , గేట్లకు తాళాలు వేసిన  గోడలు దూకి పారిపోవడం చూశాం . తెలుగుదేశం పార్టీ మహానాడుకు హాజరైన వారు ఏ ఒక్కరు కూడా  పారిపోలేదు. అసాంతం శ్రద్ధగా సభ ముగిసే వరకు  కూర్చున్న చోటే ఉండిపోయారు.   అది తెలుగుదేశం పార్టీ పై వారికున్న అభిమానం కాబోలు. లేకపోతే మా పార్టీ ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహం అయి ఉండవచ్చు. ఎన్నో మహానాడులు  తెలుగుదేశం పార్టీ నిర్వహించినప్పటికీ, గత ఏడాది ఒంగోలులో, ఈ ఏడాది రాజమండ్రిలో నిర్వహించిన  మహానాడులకు  హాజరైన ప్రజలను పరిశీలిస్తే, ఏ స్థాయిలో మా పార్టీ ప్రభుత్వం పై వ్యతిరేకత ఉన్నదో, మహానాడుకు హాజరైన  ఆ జనమే సజీవ సాక్ష్యమని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

Related posts

మార్చి 23న సేవ్ జర్నలిజం డే

Satyam NEWS

శంభులింగేశ్వరుడికి వెండి తొడుగు బహుమానం

Satyam NEWS

వృత్తి ధర్మం తప్పిన జర్నలిస్టుపై బహిష్కరణ వేటు

Satyam NEWS

Leave a Comment