36.2 C
Hyderabad
April 25, 2024 20: 46 PM
Slider ప్రకాశం

రాజకీయం తప్ప అభివృద్ధి మరచిన సీఎంకు టీడీపీ ఎమ్మెల్యేల లేఖ

#tdpmlas

మా జిల్లాకు మీ రాక , మా ప్రజలకు అందరికీ సంతోషం కన్నా, ఎక్కువ విచారాన్ని మిగిల్చింది.. మా జిల్లా ప్రగతి విషయంలో, మా జిల్లా సమస్యల విషయంలో మీరు ఏ మాత్రం శ్రద్ద వహించడం లేదని నూటికి నూరుశాతం రుజువయ్యింది అంటూ ప్రకాశం జిల్లా టిడిపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి ఒక లేఖ రాశారు.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి రాసిన లేఖ పూర్తి పాఠం:

వైయస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి

మేము ముందు మీకు రాసిన లేఖల్లో రాజకీయాన్ని వెతికారు. మా జిల్లా ఆవేదనని అర్ధం చేసుకోలేదు. ప్రజా సంక్షేమం, ప్రజా సమస్యలు, జిల్లాలో తీవ్ర సంక్షోభాన్ని చూడలేదు. మేము లేవనెత్తిన సమస్యల్లో ఏ ఒక్కదానికి పరిష్కారం చూపే ప్రయత్నం చేయలేదు. వెలుగొండను అనుమతి కలిగిన ప్రాజెక్టుగా గెజిట్ చేర్చి అంశం, జిల్లా అభివృద్ధిపై ఏమి మాట్లాడలేదు, మేము లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పలేదు. కేవలం రాజకీయ విమర్శలే చేశారు. అందుకే మరోసారి మా ఆవేదనను మీ ముందుకు తీసుకొస్తూ.., సుదీర్ఘ కాలం తర్వాత మా జిల్లాకు వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెబుతూ లేఖ రాస్తున్నాం….

అయ్యా…..    

మీ అడుగు పడిన ప్రకాశం నేల అడుగుతుంది! – ఎవరి ప్రయోజనాల కోసం మా “వెలుగొండ”కి అన్యాయం చేస్తున్నారని, గెజిట్ లో అనుమతి పొందిన ప్రాజెక్ట్ గా చేయడం కోసం కేంద్రాన్ని గట్టిగా అడగడం లేదని..!? మీ మాట విన్న ఒంగోలు గడ్డ ప్రశ్నిస్తుంది! – ట్రిపుల్ ఐటీ శాశ్వత భవన నిర్మాణం, యూనివర్సిటీ నిర్మాణం ఎప్పుడని..!?

మీ గాలి సోకిన మా తీరం కోరుతుంది! – రామాయపట్నం పోర్టుని ఎందుకు దారి మళ్లిస్తున్నారని..!?

మీ సభకు వచ్చిన మహిళ అనుకుంటుంది! – నిత్యావసరాల ధరలు, విద్యుత్తు బిల్లులు అన్నిటినీ పెంచేసి ఏ మొహంతో మీరింకా సంక్షేమం అంటున్నారని..!?

మీ మాట నమ్మిన యువత అడుగుతుంది! – నిరుద్యోగ భృతి తీసేశారు.. కనీసం ఒక్క ప్రాజెక్టు, ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేని మీరు “ఉద్యోగాలు, ఉపాధి” అంటూ ఇంకా ఎన్నాళ్ళు మోసం చేస్తారని..!?

ప్రకాశంలోని ప్రతి రైతు గుండె గర్జిస్తోంది! –

“ఎవరికో, ఎక్కడో ప్రయోజనం చేకూర్చడం కోసం వెలుగొండ ప్రాజెక్టుకు అన్యాయం చేయొద్దని ప్రకాశంలోని ప్రతి రైతు గుండె గర్జిస్తోంది. చేయి ఎత్తి మొక్కుతుంది. “వెలుగొండకు గెజిట్ ప్రకటిస్తే.. మా నీటి హక్కులు మాకుంటాయి. మా నీళ్లు మాకు వస్తాయి. మీరు వెలుగొండ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారని”..! మీకు మా జిల్లా రైతులు, ప్రజలు తరపున మరోసారి వినమ్రపూర్వకంగా వేడుకుంటున్నాం. వెలుగొండకు అన్యాయం చేయొద్దు. మా జిల్లా కడుపు కొట్టొద్దు. నీరివ్వండి. కరువు తీర్చండి. పేద రైతు కడుపు నింపండి. గొంతు దాహం తీర్చండి.  

అయ్యా సీఎం గారూ…   

జిల్లాకు వచ్చారు. సభ ఎక్కారు. ఆసరా అన్నారు. నాలుగు మాటలు చెప్పారు. గత ప్రభుత్వంలో చేసిన సంక్షేమాన్ని మరిచి మాయ మాటలు చెప్పారు. వేదికపై ఏదో రాజకీయ విమర్శలు చేశారు, కాకి లెక్కలతో గత టీడీపీ ప్రభుత్వంపై బురద చల్లారు వెళ్లారు. “రాజకీయం తప్ప పరిపాలన చేతకాని” మీ నుండి ఇంతకంటే ఏం ఆశించగలం. కాకపోతే ఒంగోలు వచ్చినందుకు, జిల్లాలో అడుగు పెట్టినందుకు మేము చాలా ఆశలు పెట్టుకున్నాం. మా జిల్లా రైతులు, మా యువత, మా మహిళలు, మా నిరుద్యోగులు, మా ప్రజలు అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కనీసం మీరు ఒక్క భరోసా అయినా ఇస్తారేమోనని ఆశగా ఎదురు చూసారు. మా జిల్లాకు ఎంతో కొంత మంచి చేయాలని…

“ఏదైనా ఒక శాశ్వత ప్రాజెక్టు ఇస్తారేమో.., ఒక పరిశ్రమ ప్రకటిస్తారేమో.., పోర్టు నిర్మాణంపై స్పష్టత ఇస్తారేమో.., యువతకు ఉపాధి దారి చూపిస్తారేమో.., వెలుగొండ ప్రాజెక్టు గెజిట్ పై పోరాడదాం అంటారేమో.., రైతులకు సాగునీటి భరోసా అందిస్తారేమో.., మీరే చంపేసిన  గ్రానైట్ పరిశ్రమని బతికించేలా ప్రకటన చేస్తారేమో.., జిల్లాలో సుబాబుల్, జామాయిల్ రైతులకు ధర వచ్చేలా ప్రోత్సహిస్తారేమో”నని ఎంతో కొంత నమ్మకంతో ఎదురు చూశాము.. మీకు గుర్తుండే ఉంటుంది.. “జిల్లాలో పాదయాత్ర, ఎన్నికల ప్రచారం సందర్భంగా చీమకుర్తి బహిరంగ సభలో మీరు మాట్లాడుతూ “గ్రానైట్ పరిశ్రమకు చేయూతనిస్తా, విద్యుత్తు రాయితీలు అందిస్తా” అన్నారు. కానీ గ్రానైట్ క్వారీలను, పరిశ్రమలను పిండి, తైలం తీసేసి, పిప్పి చేసేసి ఇప్పుడు కనీసం పట్టుంచుకోవడం లేదు. ఆ పరిశ్రమను నమ్ముకుని జిల్లాలో లక్ష కుటుంబాలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారు..! “మీకు గుర్తుండే ఉంటుంది.. మీ పాదయాత్ర సమయంలో జిల్లాలోని అద్దంకి, ఇతర ప్రాంతాల్లో సుబాబుల్, జామాయిల్ టన్నుకు రూ. 5,000/- ఇస్తామన్నారు.

అవన్నీ ఉట్టి మాటలేనా..!?

మీరు వచ్చారు, వెళ్లారు. ఆసరా పేరిట కల్లబొల్లి మాటలు, కాకమ్మ కబుర్లతో కాలక్షేపం చేసి వెళ్లిపోయారు. ఆ పథకం కూడా సక్రమంగా లబ్దిదారులకు చేరడం లేదు. గత ఏడాది కంటే ఈ ఏడాది 12 లక్షల మందిని కట్ చేశారు. పోనీ మా జిల్లాపై ఏమైనా మాట్లాడతారేమో, మేము రాసిన లేఖపై స్పందిస్తారేమో అనుకుంటే.., కనీసం జిల్లాలోని మంత్రులు కానీ, మీ ప్రజాప్రతినిధులు కానీ మా జిల్లాకు ఇది కావాలి, మా ప్రజలు ఇది అడుగుతున్నారు, మా జిల్లాలో ఇది అత్యవసరం అని అడగలేకపోయారు.

అయ్యా.. జగన్ మోహన్ రెడ్డి గారూ…

రాజకీయాలకు అతీతంగా ప్రజాకాంక్ష, ప్రజాభీష్టం, ప్రజాభిప్రాయం మేరకు మరోసారి అడుగుతున్నాం..

వెలుగొండ ప్రాజెక్టుని గెజిట్ లో చేర్చేలా కేంద్రంతో మాట్లాడండి. జిల్లాకు ఒక పరిశ్రమని ప్రకటించండి. రామాయపట్నం పోర్టు పూర్తయ్యేలా చర్యలు తీసుకోండి. జిల్లాలో గ్రానైట్ పరిశ్రమని బతికించండి. సుబాబుల్, జామాయిల్ రైతులకు మద్దతు ధర దక్కేలా చూడండి. నిత్యావసరాల ధరలు తగ్గేలా చర్యలు తీసుకోండి. రైతులకు సకాలంలో సాగునీరు, ఎరువులు అందేలా బాధ్యత వహించండి.

గుంటూరు ఛానల్ పొడిగింపు ప్రాజెక్టుకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరైన రూ. 274 కోట్ల పథకాన్ని రద్దు చేయటం సరికాదు.పాలేరుపై నిర్మిస్తున్న సంగమేశ్వరం ప్రాజెక్టు పనులను పునః ప్రారంభించి, పూర్తిచేయాలి. రాళ్లపాడు ప్రాజెక్ట్‌ను ఆధునీకరించి ఆయకట్టు పెంచాలి. రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించే మోటర్లకు మీటర్లను ఉపసంహరించుకోవాలి.

ఈ కీలక సమయంలో ప్రకాశం రైతులకు, ప్రజలకు అండగా నిలవండి.

Related posts

బాలికా విద్యపై కళాజాత ప్రదర్శన విజయవంతం

Satyam NEWS

అప్పుల తిప్పలు: రాజ్యంగ ఉల్లంఘన : సంకటంలో బ్యాంకులు

Satyam NEWS

తుది శ్వాస విడిచిన మహాభారత్ భీముడు

Satyam NEWS

Leave a Comment