విద్యాబుద్ధులు చెప్పేవారు మాత్రమే గురువులు కాదు, మనకు తెలియని విషయాలేవైనా మనకు నేర్పించే ఎవరినైనా గురువుగానే భావించాలని ..అటువంటి గురువులందరికీ పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పురాణ కాలం నుంచి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో గురువుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని..ఆదియుగం నుంచి ఆధునిక యుగం వరకూ సాగిన మానవజాతి పరిణామక్రమంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైందని ఆయన అన్నారు. మనకు ప్రపంచాన్ని పరిచయం చేసేది అమ్మానాన్నలైతే ఆ ప్రపంచంలో ఎలా జీవించాలో నేర్పించేది గురువులేనని మంత్రి అన్నారు. ‘విద్యకు విద్యార్థులు అంకితం- ఉపాధ్యాయులు విద్యార్థులకు అంకితం’ అని ఆచరించి చూపించిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 5వ తేదీన గురువులందరినీ గుర్తు చేసుకుని పూజించుకోవడం ఆ గురువులందరికీ సమాజమిచ్చే సముచిత గౌరవమన్నారు. శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు, మధ్వాచార్యుడు, తులసీదాస్ వంటి ఎందరో మహానుభావులు మన దేశాన్ని తమ బోధనలతో పావనం చేసిన గురువులన్నారు. నేటితరం ఉపాధ్యాయులు తమ వృత్తిని ఉపాధి కోసమే కాకుండా విద్యార్థుల అవసరాల మేరకు నైపుణ్యాలను పదునుపెట్టేందుకు కృషి చేసి ‘జాతినిర్మాత’లుగా నిలవాలన్నారు. నవ తరానికి చదువుతో పాటు సంస్కారం నేర్పి మంచి సమాజ నిర్మాణం స్థాపించడంలోనూ తమ పాత్రను పోషించాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.