నిష్ట శిక్షణలో నేర్చుకున్న అంశాలను విద్యార్థులకు చేరే విధంగా కృషి చేయాలని డీఈవో గోవిందరాజులు అన్నారు. శుక్రవారం కొల్లాపూర్ గోమతి హైస్కూల్‌లో జరిగిన చివరి విడత నిష్ట శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం శిక్షణకు హాజరైన ఉపాధ్యాయులను ఉద్దేశించి డీఈవో మాట్లాడుతూ నిష్ట శిక్షణ ద్వారా జిల్లాలో 4 విడతలుగా జిల్లా వ్యాప్తంగా 3050 మంది ఉపాధ్యాయులకు శిక్షణ అందించామన్నారు.
శిక్షణలో కొత్త అంశాలను నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఉపాధ్యాయులు నిత్య విద్యార్థిగా ఉంటూ మారుతున్న కాలానికి అను గుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు సాంకేతిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని, వాటిని ఉపయోగించుకుని ఉపాధ్యాయులు నూతన ప్రక్రియల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించాలని చెప్పారు.
ప్రాథమికస్థాయిలో సాంకేతిక అంశాలతో పాటు చట్టాలు, ఇతరాత్ర అంశాలన్నీంటిని క్రోడికరించి ఐదు రోజుల శిక్షణలో అందించారని, శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు పరచాలని చెప్పారు. ఉపాధ్యాయుల భావం విద్యార్థులకు అర్థమైనప్పుడే ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ప్రతి పాఠశాలలో పది సూత్రాల అమలు పరుస్తూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ప్రేమ, అంకితభావంతో బోధించాలన్నారు.
నాలుగు విడతలుగా ఐదు మండలాల ఉపాధ్యాయులకు సంపూర్ణంగా శిక్షణ తరగతులను విజయవంతంగా నిర్వహించినందుకు మండల విద్యాధికారి చంద్రశేఖర్ రెడ్డి ని అభినందించారు. సెక్టోరల్ అధికారి నారాయణ మాట్లాడుతూ శిక్షణా తరగతుల్లో పాలుపంచుకున్న ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా శిక్షణలో నేర్చుకున్న అంశాలను సరళీకృత బోధనా పద్ధతుల ద్వారా తరగతి గదిలో నిర్వహించి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన కొనసాగించాలని సూచించారు.
అంతకుముందు మండల విద్యాధికారి డాక్టర్ టీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నాలుగు విడతలుగా నాలుగు మండలాలకు సంబంధించిన 1,000 మంది ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణలో తెలియజేసిన అంశాలను గురించి వివరించారు. తరగతి గదిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నూతన ప్రక్రియలో బోధన కొనసాగేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో విధులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు ఎం ఈ ఓ సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్స్ ప్రధానోపాధ్యాయుడు ప్రకాష్ శర్మ శ్రీకాంత్ సరళ కొల్లాపూర్, పెంట్లవెల్లి, పెద్దకొత్తపల్లి, కోడేరు మండలాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.