తామంతా దొంగలమని ముద్ర వేసినందున తమకు భూ సంబంధిత విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ రెవెన్యూ జేఏసీ కోరింది. సాధారణ పరిపాలన శాఖగానే తమను మార్చాలని వారు డిమాండ్ చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ తాసిల్దార్ దారుణ హత్య తదనంతర పరిణామాలపై చర్చించేందుకు నేడు తెలంగాణ రెవెన్యూ జేఏసీ సమావేశం అయింది. ఈ సందర్భంగా వారు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు. 13, 14, 15 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ కార్యాలయాల పెన్ డౌన్ సమ్మె చేయాలని నిర్ణయించారు. అదే విధంగా ఈ మూడు రోజులో ప్రజా ప్రతినిధులను కలిసి మెమొరాండం సమర్పిస్తారు. 15వ తేదీన అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో వంటా వార్పు ఉంటుంది. వంటా వార్పు చేసి ప్రజలకు వడ్డిస్తారు. ప్రభుత్వం అప్పటికి స్పందించకపోతే 16వ తేదీ నుండి భూసంబంధిత విధులను బహిష్కరించాలని నిర్ణయించారు. కేవలం ప్రజలకు అందుబాటులో ఉండి అత్యవసర సేవలు మాత్రమే చేస్తామని వారు తెలిపారు. తమపై దొంగలు అనే ముద్ర వేశారు కాబట్టి దొంగలకు భూ రికార్డుల పనులు ఎందుకు? అని తెలంగాణ రెవెన్యూ జేఏసీ ప్రశ్నించింది. ఈ నెల 16,19, 22 తేదీలలో ఉమ్మడి జిల్లాలలో ప్రాంతీయ సదస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే “రెవెన్యూ సింహ గర్జన” హైదరాబాద్ లో నిర్వహిస్తారు. ఈరోజు కేవలం తమ శాఖకే జరిగింది అనుకోవడానికి వీలులేదు. ఇది రేపు అన్ని శాఖలకు కూడా రావచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. అన్ని ఉద్యోగ సంఘాలను ఏకం చేయగల శక్తి రెవెన్యూ శాఖకు ఉంది అని వారు విస్పష్టంగా ప్రకటించారు.