తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ పై ఇస్తున్న వేరు శనగ విత్తనానికి ఎక్కువ డిమాండ్ ఉండటం వల్ల సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వేరుశనగ విత్తన సరఫరాపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నేడు ఆయన సమీక్ష నిర్వహించారు.
ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ తదితర జిల్లాలలో ఈసారి వేరు శెనగ విత్తనానికి అధిక డిమాండ్ ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో విత్తన సరఫరాకు అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులకు చెప్పారు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ వద్ద 12 వేల క్వింటాళ్ల విత్తనం, ఇంకా అవసరమయిన విత్తనాలు టెండర్ల ద్వారా ఎంపిక పూర్తయిందని సరఫరా చేయడం జరుగుతుందని అధికారులు వివరించారు.
ప్రతి ఏడాది 35 వేల నుండి 40 వేల క్వింటాళ్లు పలు ఏజన్సీల ద్వారా రాయితీపై సరఫరా చేయడం జరుగుతుందని అయితే బయట మార్కెట్ లో ధర అధికంగా ఉంది కాబట్టి ప్రభుత్వ సబ్సిడీ (44.4%)ఎక్కువ ఉండడంతో ప్రభుత్వ విత్తనంపై రైతులు ఆసక్తి చూపుతున్నారని అధికారులు తెలిపారు. ఈ ఏడాది డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని వారు తెలిపారు. వేరుశనగ పంట వేయడానికి అక్టోబరు నెల ఆఖరు వరకు సమయం ఉందని అందువల్ల తొందరపడి విత్తనం వేయవద్దని వారు తెలిపారు. ప్రస్తుతం పడుతున్న వర్షాలలో విత్తనం వేస్తే పంట మొలక దశలో దెబ్బతినే అవకాశం ఉందని వారు తెలిపారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్దసారధి, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కేశవులు ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.