కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పట్ల ప్రదర్శించిన వివక్షను నిరసిస్తూ శాసనసభ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. కేంద్ర బడ్జెట్ లో అవసరమైన మేరకు సవరణలు చేయాలని శాసనసభ కోరింది.
అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం
“డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం భారతదేశం అన్ని రాష్ట్రాల సమాఖ్య. అన్ని రాష్ట్రాల సమీకృత సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఈ ఫెడరల్ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు వివక్ష జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇదే ధోరణి కొనసాగించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల సుస్థిర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. కానీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. పార్లమెంటులో చేసిన విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఇప్పటికీ అమలు కాకపోవటం తెలంగాణ ప్రగతిపై తీవ్రమైన ప్రభావం చూపింది. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు పలు దఫాలుగా ప్రధాన మంత్రిని, ఇతర కేంద్ర మంత్రులను కలిసి వివిధ విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు ఆర్ధిక సాయం కోరటంతో పాటు చట్ట ప్రకారం రావాల్సిన నిధులు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై అనేక సార్లు అభ్యర్థనలు అందించారు. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పట్ల పూర్తిగా వివక్ష చూపించింది. అందుకే తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర అనుసరించిన తీరుపై ఈ సభ తీవ్ర అసంతృప్తిని, నిరసనను తెలియజేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్ కు సవరణలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేటట్లు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సభ తీర్మానం చేస్తుంది.”