39.2 C
Hyderabad
March 28, 2024 15: 07 PM
Slider సంపాదకీయం

అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు అంతా సిద్ధం

#Telangana CM KCR

ఈ నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. శాసన సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) లో ప్రభుత్వం ప్రతిపాదించే అంశాలు కూడా ఖరారయ్యాయి. వాటిలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, బాధితులకు అందుతున్న వైద్యం ప్రధానమైనవి.

రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ ఆరంభమైన తొలి రోజుల నుంచి ప్రభుత్వంపై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. సకాలంలో అవసరమైన కట్టుదిట్టమైన భద్రతాచర్యలు తీసుకోవడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్, బీజీపీ, ఇతర ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

కరోనా ఉద్ధృతి నివారణకు అవసరమైన విధంగా ప్రభుత్వ ఆసుపత్రులను సంసిద్ధంచేయకపోవడం వైఫల్యానికి దారి తీసిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ లో కరోనా నిర్ధారణ పరీక్షలు తక్కువ చేస్తూ నిర్లిప్తంగా ఉన్న కారణంగానే కేసులు అనూహ్యంగా పెరిగినట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి.

కరోనా పరీక్షల నిర్వహణలో పూర్తి వైఫల్యం

ఐసోలేషన్ వార్డులు గుర్తించడం, తగిన సిబ్బంది నియామకం, వైరస్ బాధితులకు కల్పించాల్సిన కనీస మౌలికవసతుల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో వైరస్ వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైరస్ నిర్ధారణ పరీక్షలు ముమ్మరంగా నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన తరువాత ప్రభుత్వంలో కొంచెం కదలిక వచ్చింది.

  ఇప్పటికీ హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతంలో వైరస్ పరీక్షల నిర్వహణ సక్రమంగా లేదని ప్రతిపక్షాలు బాహాటంగానే విమర్శిస్తున్నాయి. దీనికితోడు ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ రాజకీయ వర్గాలలో, పౌరసమాజంలో వేడి పుట్టించింది. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులకే కోవిడ్ రోగులకు  వైద్యం అందించాలన్న సర్కార్ హుకూంను ఏ మాత్రం పట్టించుకోని కార్పొరేట్ హాస్పిటల్స్ పై కఠినచర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

ప్రైవేటు హాస్పిటల్స్ అమానవీయ చర్యలను సభ్యసమాజం గర్హించినా, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అంతేకాక ముందు వరుస యోధుల త్యాగాన్ని ప్రశంసిస్తూ  ప్రకటించిన అదనపు ఆర్ధిక లబ్ధి విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం విమర్శలపాలైంది.

మహమ్మారితో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రి పరిపాలనకు దూరంగా ఉన్నారన్న ఆరోపణలు వచ్చాయి. వలస కార్మికులకు ప్రయాణం సౌకర్యాలు కల్పించాల్సిన సమయంలో కూడా ప్రభుత్వం తాత్సారం చేసినట్లు ప్రతి పక్షాలు నిందించాయి.

విద్యాసంస్థలు నిరవధికంగా మూతపడడంతో విద్యార్థులు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఒకవైపు…కరోనా కారణంగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగింది. వీటన్నింటికి తక్షణ పరిష్కారాలు లేకపోయినా, ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు కూడా కనిపించడం లేదు.

ప్రతిపక్షాలకు ఏ మాత్రం బలం లేని అసెంబ్లీలో ఈ అంశాలపై ఘాటు చర్చ జరిగే అవకాశం లేదు. అంతే కాదు ఉన్న విపక్షాలు సూచనలు చేసినా పట్టించుకునే అవసరం ప్రభుత్వానికి లేదు కాబట్టి అసెంబ్లీలో కేవలం ప్రభుత్వ వాదన మాత్రమే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తున్నది.  

Related posts

కొత్త మద్యం విధానంలో ఎలాంటి తప్పు లేదు

Satyam NEWS

విశ్వ రహస్యాలను తెలిపే నాసా పవర్‌ఫుల్‌ టెలిస్కోప్‌

Sub Editor

కొనసాగుతున్న భక్తుల రద్దీ

Bhavani

Leave a Comment