ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా తెలంగాణ బంద్ సంపూర్ణంగా జరిగిందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. బంద్ కు మద్దతు ఇచ్చిన అన్ని వర్గాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేస్తున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. అంతే కాకుండా అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు భౌతిక దాడులకు పాల్పడటం సరికాదని ఆయన అన్నారు. బంద్ సందర్భంగా అరెస్ట్ చేసిన వారందరినీ భేషరతుగా విడుదల చేయాలని అశ్వత్థామ రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు 15 రోజులుగా చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈరోజు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్త బంద్ జరిగింది. ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. బంద్‌లో భాగంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్టీసీ సమ‍్మె యథావిథిగా కొనసాగుతుందని అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు.
previous post