ఈ మధ్య ఆ.జ్యో.రా బిజెపి అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి వచ్చి తాను రామోజీరావుకు పోటీగా ఎదిగినట్లు కలగంటూ ఫొటోలు తన పత్రికలో అచ్చువేసుకున్నాడు కదా. ఆ ప్రభావం ఈ వారం కొత్త పలుకులో చూపించేశాడు. తెలంగాణ సిఎం కేసీఆర్ పై ఒంటికాలిపై లేచాడు. కేసీఆర్ మొండి వైఖరి అవలంబిస్తున్నాడని తేల్చేశాడు. కేసీఆర్ మొండి వైఖరి ఆ.జ్యో.రాకు ఇప్పుడు తెలిసిందేమో అందరికి తెలంగాణ ఉద్యమ సమయంలోనే తెలుసు. అయినా రెండు సార్లు గెలిపించేశారు.
పనిలోపనిగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ తన మాట వినడం లేదనే రోదన కూడా ఆ.జ్యో.రా ఎక్కువ చేసేశాడు. ఆర్టీసీ సిబ్బంది సంఘ నాయకుడు అశ్వర్ధరెడ్డి మాట తాను వినేదేంటని కేసీఆర్ మొండికి వేస్తున్నాడట. ఆహా ఏం చెబుతావు సోదరా? ఇక్కడ ప్రభుత్వం, దాని పాలసీలు, ఆర్ధిక వెసులుబాట్లు ఏమీ ఉండవా? కేసీఆర్ కు ఇగో ఎక్కువ అన్నట్లుగా ఎడాపెడా రాసేస్తున్నాడు ఈ చెత్తపలుకుగాడు. మరీ దారుణమైన విషయం ఏమిటంటే నవ్వు సిఎంగా పనికిరావు నీ కొడుకును సిఎం గా చెయ్యి అని అమిత్ షా చెప్పాడట.
చేతిలో పేపర్ ఉందని ఎంత మాట పడితే అంత మాట రాయడమేనా? ఇదేనా జర్నలిజం స్వేచ్ఛ. ఇలాంటి అవాకులు చవాకులు రాయడం, రాజకీయ ప్రయోజనాల కోసం, ఆర్ధిక ప్రయోజనాల కోసం పత్రికను తాకట్టు పెట్టడం, జర్నలిజం విలువలు అంటూ నీతులు చెప్పడం… ఏమి నాటకాలు సోదరా? అన్ని తాకట్టు పెట్టడం నుంచి నీతులు చెప్పడం వరకూ అన్నీ నీవే చేసేస్తే చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటుంది సోదరా.
అమిత్ షా వ్యాఖ్యల తర్వాత బిజెపికి తనకు మధ్య సఖ్యత కుదుర్చే వారు ఎవరా అని కేసీఆర్ ఎదురు చూస్తున్నారట. ఎన్ని కొత్త విషయాలు చెబుతావు సోదరా. నిజంగా ఆ అవకాశమే ఉంటే నువ్వే జొరబడేవాడివి కదా బయటకు చెబుతావా? బిజెపితో వైరం పెట్టుకుని తప్పు చేశానని సిబినాయుడు నిన్న చెప్పాడు నేడు ఆ.జ్యో.రా రాసేశాడు. ఆహా ఏం జర్నలిజంరా బాబూ. సిబి నాయుడు ఏపిలో ఓడిపోయింది బిజెపితో వైరం పెట్టుకున్నందుకు కాదు. కులతత్వం పెచ్చుమీరినందుకు. కులతత్వంతో సమాజంలోని అన్ని వర్గాలనూ దూరం చేసుకుని ఇప్పుడు దానికి రాజకీయ కారణాలు వెతకడం సిబినాయుడికే చెల్లింది.
దానికి జర్నలిజం రంగు అద్దడం ఈ సోదరుడికే చెల్లింది. గత వారం రాసిందే మళ్లీ రాశాడు -1989లో ఎన్టీఆర్ ఓటమికి కారణం ఎన్జీవోలే అని. గత వారం సత్యం న్యూస్ ఇదే విషయాన్ని విడమరచి చెప్పింది – 1989 లో ఎన్టీఆర్ ఓడిపోయింది కేవలం కులతత్వం వల్ల. ఈ విషయాన్ని అప్పటి పిసిసి అధ్యక్షుడు మర్రి చెన్నారెడ్డి ముందుగానే గుర్తించి దానికి అవసరమైన ప్రచారం కల్పించడంతో కాంగ్రెస్ గెలుపు సునాయాసం అయింది.
అదే విధంగా చంద్రబాబు పరాజయానికి కూడా ఎన్జీవోల కారణాన్ని చూపించే ప్రయత్నం చేయడం కూడా చరిత్ర వక్రీకరణే. ఒకే అసత్యాన్ని పదే పదే చెప్పి దాన్ని నిజమని నమ్మించేందుకు ఆ మధ్య గోబెల్స్ అనే ఆయన ఒకాయన ఉండేవాడు. వీరంతా ఆయన వారసులే. చంద్రబాబు అనవసరం గా తమకు దూరం అయ్యాడని ఒక బిజెపి నాయకుడు అన్నాడట. ఆ నాయకుడి పేరు చెపగలవా సోదరా? చంద్రబాబు బిజెపికి దూరం కాలేదు. బిజెపి వ్యూహాత్మకంగా చంద్రబాబుకు దూరం అయింది.
అడ్డగోలుగా దోచేస్తుంటే అంటిపెట్టుకుని ఉండలేక బిజెపి దూరం జరిగింది. ఇది వాస్తవం కాగా దాన్ని అదేదో సిబినాయుడి ఛాయిస్ లాగా చెప్పడం చరిత్ర వక్రీకరణ. ఏపిలో జగన్ ను ఫినిష్ చేయడం బిజెపికి ఐదు నిమిషాల పని అట. అబ్బా ఏం విశ్లేషణ. సూపర్. సిబి నాయుడు చెప్పాడా? ఏమి రాస్తావు నాయనా. నువ్వు నీ జర్నలిజం. తెలంగాణ సచివాలయంలోకి జర్నలిస్టులను అనుమతించే విషయంపై జర్నలిస్టులు చీఫ్ సెక్రటరీ ఎస్ కె జోషికి వినతి పత్రం ఇచ్చారు. తాత్కాలిక సచివాలయంలో ఆఫీసర్లు కూర్చోడానికే స్థలం లేదు.
ఇక జర్నలిస్టులను ఎక్కడ కూర్చోబెడతారు? అదే విషయం చీఫ్ సెక్రటరీ చెప్పారు. అందులో తప్పేముంది? తానూ ప్రభుత్వంలో ఒక ఉద్యోగినే అని ఆయన అన్నారు అందులో తప్పేముంది? చీఫ్ సెక్రటరీ స్వతంత్రించి చేయగల పనులు చాలా తక్కువ ఉంటాయి. ఇలాగే ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎల్ వి సుబ్రహ్మణ్యం పై కూడా తెలిసీ తెలియకుండా రాసేశాడు అప్పటిలో. నాకు ఓట్లు అవసరం లేదు, అందుకు పబ్లిసీటీ అవసరం లేదు అని ఎస్ కె జోషీ అనడంలో తప్పేముందో నాకైతే అర్ధం కావడం లేదు.
కేసీఆర్ గోటితో పోయేదానికి గొడ్డలి వరకూ తెచ్చుకుంటున్నాడట. ఏమైంది సోదరా? తెలంగాణ లో ప్రభుత్వం పడిపోయిందా? ఏమీ కాదు నీవు పైకి ఆందోళన (లోన ఆనందం ) ప్రదర్శించే ఏ పనీ జరగదు గాక జరగదు. నువ్వు నిశ్చింతగా ఉండు. గతంలో రామోజీ రావు రాజగురువుగా ఉండేవారని, ఆయన స్థానంలోకి నువ్వు వెళ్లాలని శత విధాలా ప్రయత్నిస్తున్నావు. ప్రయత్నించి తప్పులేదు. మళ్లీ సీబీనాయుడు అధికారంలోకి వస్తే రాజగురువు వు కా. ఎవరికి అభ్యంతరం లేదు.
కానీ ఈ లోపు ఇద్దరు ముఖ్యమంత్రులు నీ మాట వినడం లేదని ఉక్రోషం మాత్రం ప్రదర్శించవద్దు. ప్రతి వారం నువ్వు రాసే చెత్తంతా చదివితే ఒక కొత్త విషయం మాత్రం ఉంటుంది సోదరా. అందుకు నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఈ వారం చెప్పిన కొత్త విషయం ఏమిటంటే – ఏపిలో ఇక తెలుగుదేశం బతకదు – అని చెప్పావు సోదరా.
హేట్సాఫ్…అమిత్ షాను కలిసి వచ్చిన తర్వాత నీకు ఈ విషయం తెలిసింది. చాలా సంతోషం. ఇదే విషయం సిబినాయుడికి చెప్పు. కొసమెరుపు: ఆర్టికల్ 370 అంటే ఏమిటి? ఏం జర్నలిస్టులురా బాబూ ఆర్టికల్ 370 అంటే తెలియదా? ఆర్టికల్ 369 తర్వాత వచ్చేదే ఆర్టికల్ 370.