తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా డాక్టర్ తమిలిసై సుందరరాజన్ ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన తమిలిసై తమిళనాడు బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా ఉన్నారు. తమిళనాడులో బిజెపి తరపున రెండు సార్లు అసెంబ్లీకి, రెండు సార్లు పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆమె పార్టీకి అందించిన సేవలకు గుర్తుగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా నియమించారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా నియమించారు. గత లోక్ సభ ఎన్నికలలో దత్తాత్రేయకు సికింద్రాబాద్ టిక్కెట్ ను బిజెపి నిరాకరించిన విషయం తెలిసిందే. దత్తాత్రేయను గవర్నర్ గా నియమిస్తారని ఆయనకు కేంద్ర మంత్రి వర్గం నుంచి ఉద్వాసన పలికినపుడే ఊహాగానాలు వెలువడ్డాయి కానీ ఎన్ డి ఏ 1 ప్రభుత్వంలో అది కుదరలేదు. ఎన్ డి ఏ 2 లో దాన్ని అమలు చేశారు. వీరిద్దరితో బాటు కేరళ గవర్నర్ గా ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ను, మహారాష్ట్ర గవర్నర్ గా భగత్ సింగ్ ఖోషియారీ ని నియమించారు. ఇప్పటి వరకూ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న కల్ రాజ్ మిశ్రాను బదిలీ చేసి రాజస్థాన్ గవర్నర్ గా నియమించారు.
previous post
next post