37.2 C
Hyderabad
April 19, 2024 11: 54 AM
Slider సంపాదకీయం

గవర్నర్ వ్యవస్థ పరువు తీస్తున్న తమిళసై

#TamilsaiSoundararajan

రాజ్యాంగ పరంగా బాధ్యతలు నిర్వర్తించాల్సిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఉన్న పరువును కూడా పోగొట్టుకుంటున్నారు. తరచూ మీడియా ముందుకు వచ్చి బేలగా మాట్లాడుతున్న తమిళసై గవర్నర్ వ్యవస్థకు ఉన్న ప్రతిష్టను దిగజారుస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తమిళసై కి సహకరించడం లేదు. ఇందులో ఎలాంటి దాపరికం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై పోరాటం ప్రారంభించిన నాటి నుంచి గవర్నర్ వ్యవస్థకు ఆయన సహకరించడం లేదు. గవర్నర్ ను బిజెపి ప్రతినిధిగానే ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారు. ఈ స్థితిలో గవర్నర్ ఏం చేయాలి? ఏం చేయాలి అంటే కచ్చితంగా మీడియా ముందుకు వచ్చి తన అసక్తతను వ్యక్తం చేయడం మాత్రం కాదు.

అదే విధంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిపి ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేయడం, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో కలిసి అదే పని చేయడం గవర్నర్ తమిళసై చేసిన మొదటి తప్పు. ఒక రాష్ట్ర గవర్నర్ ప్రధానిని లేదా హోం మంత్రిని కలవాలంటే రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు ఉండాలి.

తెలంగాణ లో అలా లేదే… మరి వారిద్దరూ గవర్నర్ ను ఎందుకు కలిశారు? గవర్నర్ వారినెందుకు కలిశారు? ఇది రాష్ట్రంలో గవర్నర్ వ్యవస్థ పరువును పూర్తిగా దిగజార్చడమే అవుతుంది. పోనీ వారిద్దిరిని కలిసిన తమిళసై గమ్మున హైదరాబాద్ వచ్చేస్తే అదోతీరు.

అలా కాకుండా మీడియాతో మాట్లాడుతూ తాను మహిళనని తనను గౌరవించాలని తనను చెల్లిగా ఆదరించాలని ప్రాధేయపడటంతో గవర్నర్ వ్యవస్థ కు మరింత పరువు తక్కువ అయింది. తాను సమ్మక్క జాతరకు వెళ్లే సమయంలో హెలికాప్టర్ ఇవ్వలేదని, అదే విధంగా భద్రాచలం కు కూడా రోడ్డు మార్గంలోనే వెళుతున్నానని అప్పటిలో చెప్పి తన దీన స్థితిని గవర్నర్ వెలిబుచ్చుకున్నారు.

గవర్నర్ ఏ జిల్లాకు వెళ్లినా అక్కడ కనీసం జిల్లా కలెక్టర్లు కూడా గవర్నర్ వద్దకు రావడం లేదు. గవర్నర్ పిలిస్తే కలెక్టర్లే రాకపోతే అంతకన్నా సీనియర్ ఐఏఎస్ అధికారులు వస్తారని ఆశించడం తప్పే. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయితే అసలు పిలిచినా రావడం లేదు. మంత్రులు కూడా గవర్నర్ పిలిస్తే వచ్చే సాంప్రదాయం లేదు. ప్రభుత్వ యంత్రాంగం సహకరించకపోతే గవర్నర్ ఏం చేయాలి?

ఏమీ చేయలేరు. అది అంతే. గవర్నర్ పిలిస్తే రావాలని ఎక్కడైనా రాసి ఉందా? గవర్నర్ రాష్ట్ర మంత్రి వర్గం సిఫార్సు మేరకు పని చేయాల్సిందే తప్ప స్వతంత్రించి ఏ పనీ చేయలేరు. అలా కాకుండా గవర్నర్ తాను స్వంతంగా పని చేస్తానంటే ప్రభుత్వం అంగీకరించకపోతే, సాధారణ పరిస్థితులు ఉన్న రాష్ట్రంలో గవర్నర్ ఏమీ చేయలేరు.

మరి గవర్నర్ ఏం చేయాలి? గవర్నర్ రాజకీయ కార్యకలాపాలు చేసే అవకాశం లేదని ముందుగా గుర్తించాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందులోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి బలమైన ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో ఏమీ చేయలేరు. ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను నియంత్రించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంటుంది కాబట్టి… అటు నుంచి ఏదైనా చర్యలు తీసుకునేలా చూసుకోవాలి తప్ప ‘‘నాకు ప్రోటోకాల్ ఇవ్వడంలేదు’’ అంటూ మీడియా ముందు వాపోతుంటే ఉన్న పరువు కూడా పోతుంది.

శాసన మండలికి గవర్నర్ కోటాలో ఒక టీఆర్ఎస్ నాయకుడిని నామినేట్ చేయడంపై గవర్నర్ ఎదురుతిరిగారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన పేరును గవర్నర్ ఆమోదించకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ వేదికలపైకి వచ్చి ‘చూడండి గవర్నర్ నా మాట వినడం లేదు’ ‘ నేను అన్నలాంటి వాడిని కదా నా మాట కూడా వినకపోతే ఎలా’ అని అమాయకంగా ప్రశ్నించలేదు. ఆయన చేయాల్సింది ఆయన చేసుకున్నారు.

గవర్నర్ కూడా అలానే చేసుకోవాలి తప్ప రోడ్కెక్కి బేలగా వాదనలు వినిపిస్తుంటే తలసాని శ్రీనివాసయాదవ్ లాంటి మంత్రులు కూడా గవర్నర్ వ్యవస్థను తీవ్రంగా విమర్శిస్తారు. ప్రభుత్వం సహకరించకపోతేనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక టీఆర్ఎస్ పార్టీ తన కార్యకర్తలను ఉసిగొల్పి గవర్నర్ ఎక్కడికి వెళ్లినా అక్కడ నిరసనలు ప్లాన్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం పెద్ద కష్టం కాదు. గవర్నర్ ఇలానే వ్యవహరిస్తూ పోతే అది జరగడానికి ఎక్కువ కాలం పట్టదు.

Related posts

ఆణిముత్యాలకు 46 లక్షల 28వేల నగదు బహుమతులు…!

Satyam NEWS

విపత్కర సమయంలో కూడా వికృత రాజకీయం

Satyam NEWS

శనివారం కల్వకుర్తిలో కరెంట్ కట్

Satyam NEWS

Leave a Comment