సినిమా షూటింగ్ లకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగు సినీప్రముఖులు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించడంతో ఆయన అర్ధాంతరంగా ఆగిపోయిన సినిమా, టీవి షూటింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతి ఇచ్చారు.
సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధర్వంలో శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతి భవన్ లో, చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, ఎస్.ఎస్ రాజమౌళి, దిల్ రాజు, త్రివిక్రమ్, ఎన్ శంకర్, రాధాకృష్ణ, సి. కల్యాణ్, సురేష్ బాబు, కొరటాల శివ, జెమిని కిరణ్ , మెహర్ రమేష్ వంటి టాలీవుడ్ ప్రముఖులు కలిశారు.
సినీ పరిశ్రమలోని కార్మికుల కోసం తాము చేపట్టిన సహాయక చర్యలను సీఎంకు వివరించి, షూటింగ్స్‌కు అనుమతి కోరగా, జూన్ మొదటివారం నుంచి చిత్రీకరణలు ప్రారంభించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందని కేసీఆర్ తెలిపారు. దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం రూపొందించి, అందరినీ ఆదుకొంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారని చిరంజీవి పేర్కొన్నారు.
సినిమా, టీవీ, డిజిటల్ మీడియా కి సంబంధించిన సమస్యలను సీఎం సానుకూలంగా విని, వేలాదిమంది రోజువారీ వేతన కార్మికులకు ఊరట కలిగేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని చిరంజీవి ట్వీట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి పరిశ్రమ తరఫున చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.