మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రానికి చుట్టుముట్టిన పెద్ద వివాదం సమసిపోయింది. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని తమిళనాడు యువ సంఘం నాయకులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చరిత్రను వక్రీకరించికన ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన హైకోర్టు తన తుది తీర్పును వెలువరించింది. ‘సైరా’చిత్రం విడుదల విషయంలో తాము ఎట్టిపరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సినిమాను కేవలం వినోద పరంగానే చూడాలని పిటిషనర్‌కు సూచించింది. ఎంతో మంది మహానుభావుల చరిత్రను ఉన్నది ఉన్నట్టు ఎవరు చూపించారని ప్రశ్నిస్తూనే.. గతంలో గాంధీ, మొఘల్‌ల సామ్రాజ్యాన్ని తెరకెక్కించిన చిత్రాలను ప్రస్తావించింది. సినిమా నచ్చేది నచ్చనిది ప్రేక్షకులకు వదిలేయాలని తెలిపింది. ప్రస్తుతం సినిమాను తాము ఆపలేమంటూ ఫిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో తెలంగాణలో సైరా సినిమా విడుదలకు అడ్డంకులు తొలిగిపోయాయి. ఇప్పటికే ఈ చిత్రంపై వచ్చిన తొలి రివ్యూతో ‘సైరా’ చిత్ర యూనిట్ ఆనందంలో ఉండగానే.. హైకోర్టు తీర్పు రెట్టింపు ఉత్సాహాన్ని కలిగిస్తోందని చిత్ర సభ్యులు పేర్కొన్నారు. చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘సైరా’ రేపు(బుధవారం) గాంధీ జయంతి కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే
previous post
next post