ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాల్సిందేనని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా చర్చలు జరపాల్సిన డేటు టైము కూడా ఫిక్స్ చేసింది. శనివారం ఉదయం 10.30 గంటలకు రెండు యూనియన్లను చర్చలకు పిలవాలని ఆదేశించింది. అలాగే మూడు రోజుల్లో చర్చలు పూర్తిచేయాలని పేర్కొంది. శుక్రవారం ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ, ప్రభుత్వం వాదనలు విన్న కోర్టు తీర్పును వెలువరించింది. కార్మికుల డిమాండ్లు పరిష్కారం అయ్యేలా చూడాలని అభిప్రాయపడింది. అలాగే చర్చల వివరాలను ఈ 28న కోర్టుకు తెలపాలని ఆదేశాలు జారీచేసింది. వాదనల సందర్భంగా ప్రభుత్వం చెప్పిన కారణాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ ఎండీ నియామకం ఇప్పటివరకు ఎందుకు చేపట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎండీ నియామకం చేపట్టి ఉంటే కార్మికులకు నమ్మకం కలిగి ఉండేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. అయితే న్యాయస్థానం మాత్రం ప్రభుత్వ తీరుపై పలు ప్రశ్నలు సంధించింది. ప్రస్తుతం ఆర్టీసీ ఇంచార్జ్‌గా సీనియర్ అధికారి ఉన్నారని ప్రభుత్వం తెలుపడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పుడున్న అధికారి సమర్థుడైతే ఎండీగా ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ప్రజలు శక్తివంతులని, వాళ్లు తిరగబడితే ఎవరూ ఆపలేరని కోర్టు తెలిపింది. రెండు వారాలుగా ఆందోళనలు జరుగుతుంటే ప్రభుత్వం వాటిని ఎందుకు ఆపలేదని ప్రశ్నించిన న్యాయస్థానం.. కార్మిక సంఘాలతో చర్చలు ఎందుకు జరపలేదని ప్రశ్నించింది. రేపు(శనివారం) ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన రాష్ట్ర బంద్‌పై ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలని కోరింది. కార్మికులు శాంతియుతంగా బంద్ చేపడితే అభ్యంతరం లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
previous post