ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ పట్టణంలో ఫిబ్రవరి 10 నుంచి 15వ తేదీ వరకు జరిగిన 68వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్‌లో తెలంగాణ పోలీస్ బృందం అద్భుత ప్రదర్శనతో విశేష ప్రతిభను కనబరిచింది. రాష్ట్రంలోని పోలీస్ సిబ్బంది అత్యున్నత నైపుణ్యం, క్రమశిక్షణ, కట్టుబాటుతో మొత్తం 18 పథకాలు గెలుచుకొని రాష్ట్ర ఖ్యాతిని పెంచారు. పోటీలలో పాల్గొన్న ఇతర రాష్ట్రాలు పథకాల వేటలో ద్వితీయ సంఖ్యను చేరుకోలేకపోయాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి పాల్గొన్న పోలీస్ బృందాలలో తెలంగాణ పోలీస్ బృందం ‘ఓవరాల్ టీం ఛాంపియన్‌షిప్’ సాధించి, కృషి, పట్టుదలతో సత్తా చాటింది.
మొత్తం 06 బంగారు, 04 రజత, 08 కాంస్య పతకాలను కైవసం చేసుకున్న తెలంగాణ పోలీస్ బృందం విశేష ప్రతిభ కనబరిచింది. సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్,యాంటీ సాబటేజ్ చెక్ కంప్యూటర్ అవేర్‌నెస్, డాగ్ స్క్వాడ్ పోటీ, ఓవరాల్ టీం ఛాంపియన్‌షిప్ ను కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటి పోలీస్ డ్యూటీ మీట్ గత ఆగస్టు 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు హైదరాబాదులో నిర్వహించిన విషయం విదితమే. ఈ డ్యూటీ మీట్‌లో విజేతలైన వారు జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం వహించారు.
డి జి పి , సిఐడి మరియు తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్ నోడల్ ఆఫీసర్ శిఖా గోయల్ మాట్లాడుతూ, “మా బృందం అద్భుతమైన ప్రదర్శన కనబరచినందుకు గర్విస్తున్నాము. వారి విజయానికి వారి కఠిన శిక్షణ, అంకితభావం, మరియు నిబద్ధతే కారణం” అని అన్నారు. ఈ పురస్కార ప్రధానోత్సవంలో రాధా కృష్ణ కిషోర్, ఝార్ఖండ్ ఆర్థిక మంత్రి, ఝార్ఖండ్ క్రీడా మంత్రి, ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఐజీ సీఐడీ (ఆర్గనైజింగ్ సెక్రటరీ) మరియు ఇతర జాతీయ స్థాయి పోలీస్ అధికారులు హాజరయ్యారు.
తెలంగాణ పోలీస్ బృందం తరఫున బి. రాం రెడ్డి,, ఎస్పీ, సీఐడీ, తెలంగాణ, ‘ఓవరాల్ టీం ఛాంపియన్‌షిప్ ట్రోఫీ’ని స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ, డా. జితేందర్, ఈ గెలుపుపై సంతోషం వ్యక్తం చేస్తూ, “ఈ విజయానికి కారకులైన పోలీస్ సిబ్బందిని, శిక్షకులను మరియు సహాయక సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు. 68వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్‌లో సాధించిన ఈ ఘనత తెలంగాణ పోలీస్ బలగాల నిబద్ధత, సమర్థత, విశ్వసనీయతకు నిదర్శనం” అని పేర్కొన్నారు.